ఒడిశాలో ఆదాయపన్ను శాఖ అధికారులు జరిపిన సోదాల్లో భారీగా నోట్లకట్టలు బయటపడ్డాయి. రెండు మద్యం తయారీ కంపెనీల్లో ఐటీశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. సదరు కంపెనీల మీద పన్నుఎగవేత ఆరోపణలు ఉండటంతో... ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కోట్లాది రూపాయల నగదు బయటపడింది. రెండు రోజులపాటు జరిపిన సోదాల్లో కోట్ల రూపాయల నగదు సీజ్ చేసినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. ఒడిశాలోని బోలంగీర్, సంబల్‌పూర్, ఝార్ఖండ్‌లోని రాంచీ, లోహర్‌దగా ప్రాంతాల్లోని మద్యం తయారీ కంపెనీల్లో బుధవారం ఆదాయపన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. మద్యం కంపెనీకి చెందిన కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు జరిపారు. ఈ క్రమంలోనే బీరువాలో దాచిన కోట్ల రూపాయల నగదు చూసి అధికారులు షాక్ తిన్నారు. వీటిని లెక్కపెట్టే ప్రక్రియను మొదలెట్టారు. క్యాష్ కౌంటింగ్ మెషీన్లతో వీటిని లెక్కపెట్టే ప్రక్రియను ప్రారంభించగా.. అవి కాసేపటికే మొరాయించాయి. బుధవారం సాయంత్రం వరకూ 50 కోట్ల నగదును లెక్కపెట్టామన్న ఐటీ అధికారులు.. ఆ తర్వాత మెషీన్లు పనిచేయడం ఆగిపోయినట్లు తెలిపారు. గురువారం మిగతా ప్రక్రియ పూర్తిచేస్తామని వెల్లడించారు.రెండు రోజుల్లో సుమారు 150 కోట్ల రూపాయల నగదును ఐటీ శాఖ సీజ్ చేసినట్లు తెలిసింది.బోలాంగ్రీ కార్యాలయంలో భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు మద్యం తయారీ కంపెనీలతో పాటుగా వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపైకూడా ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు జరిపినట్లు సమాచారం. బౌధ్ పురునా కటక్ వ్యాపారి అశోక్ కుమార్ అగర్వాల్‌కు చెందిన రైస్ మిల్లు, ఇళ్లపై ఐటీ బృందం సోదాలుచేసింది సంజయ్ సాహు, దీపక్ సాహు అనే మద్యం వ్యాపారుల ఇళ్లపైనా సోదాలు జరిగినట్లు తెలిసింది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.