ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే టీడీపీ-జనసేన పొత్తు తప్పనిసరి అన్నారు పవన్ కళ్యాణ్. అందుకే తమ పొత్తును గెలిపించండి.. మళ్లీ వైఎస్సార్‌సీపీ వైపు చూస్తే.. ప్రజల భవిష్యత్‌ను నాశనం చేసుకున్నట్లే అన్నారు. వైఎస్సార్‌సీపీ దుష్టపాలనను ఇంకా మూడు నెలలే భరిద్దామన్నారు. రాబోయే మూడు నెలలూ వ్యక్తిగతంగా కాకుండా, రాష్ట్ర అభివృద్ధి కోసం పొరపొచ్చాలు లేకుండా టీడీపీతో కలిసి పోరాడాలన్నారు. పొత్తు గురించి ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడితే అధికార పార్టీకి అమ్ముడుపోయినట్లేనన్నారు. తన చుట్టూ తిరగకుండా.. ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రక్రియపై దృష్టిసారించాలన్నారు. ఓటరును ఇంటి నుంచి పోలింగ్ బూత్ వరకు తీసుకు రావాలన్నారు. 2024లో టీడీపీ-జనసేనలు అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కొనసాగిస్తామన్నారు. ఇంకా రూ.పది ఎక్కువే ఇస్తాముగానీ కోత విధించబోమన్నారు. జగన్ ఓటు అనే బోటు మీద సముద్రం దాటారు.. ఆ వెంటనే తెప్ప తగలేశారన్నారు. ప్రకృతిని నాశనం చేసి సంపాదించిన డబ్బుతో జగన్ విలువైన ఓటును కొనేస్తారన్నారు. ఈసారి ఓటు సుస్థిర, బలమైన మార్పు కోసం వేయాలన్నారు.