సెల్ టవర్లను ఇళ్లపై ఏర్పాటు చేయడంపై చాలా వరకు అభ్యంతరాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. గ్రామాల్లో అయితే ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేస్తారు కానీ.. అదే పట్టణాలు, నగరాలు అయితే బిల్డింగ్ పై అంతస్థులోనే ఏర్పాటు చేస్తారు. ఒకవైపు రేడియేషన్, మరోవైపు.. అధిక బరువు కారణంగా ఆ బిల్డింగ్‌లో నివసిస్తున్న వారే కాకుండా చుట్టు పక్కల ప్రాంతాల వారు కూడా తీవ్ర భయాందోళనలో బతుకుతూ ఉంటారు. అయితే తాజాగా ఓ సన్నని బిల్డింగ్‌పై ఉన్న మొబైల్ టవర్.. ఆ బిల్డింగ్‌తో పాటు కూలిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఆ సంఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచడంతో తెగ వైరల్‌గా మారింది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది.
బెంగళూరు నగర శివారులోని పార్వతి నగర్‌లో ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌కు చెందిన సెల్ టవర్ కూలిపోయింది. అయితే సెల్ టవర్ ఉన్న బిల్డింగ్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో జేసీబీతో కూల్చివేతలు చేస్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. సెల్ టవర్ ఉన్న పాత భవనం ఒకేసారి రెండూ కూలిపోయాయి. ఆ సెల్ టవర్‌కు ఉన్న వైర్లు, అవి ఉన్న రూం కూడా కుప్పకూలింది. అయితే అప్పటికే ఆ బిల్డింగ్‌లో ఉన్న 11 మందిని స్థానికులు ఖాళీ చేయించి బయటకు తీసుకువచ్చారు. దీంతో వారికి ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ ఘటనకు సంబంధించి సెల్ టవర్, బిల్డింగ్ కూలిపోతున్న దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచడంతో వైరల్‌గా మారాయి.
శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు వెల్లడించారు. టవర్ ఉన్న బిల్డింగ్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో కొత్త ఇంటిని నిర్మించేందుకు పునాది తీస్తుండగా.. జేసీబీతో అక్కడ పని చేస్తుండగా.. ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. ఈ బిల్డింగ్, సెల్ టవర్ కూలడంతో పక్కనే ఉన్న 2 దుకాణాలు కొంత వరకు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై బృహత్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, బెంగళూరు పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఘటనాస్థలికి వెళ్లి మరీ పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. అయితే పాత భవనంపై సెల్ టవర్ ఏర్పాటు చేశారని.. ఈ విషయంలో బీబీఎంపీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. ఆ ఖాళీ స్థలం యజమాని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు బీబీఎంపీ అధికారులు తెలిపారు. అయితే అదృష్ట వశాత్తు ఆ బిల్డింగ్, సెల్ టవర్ ఖాళీ స్థలంలో పడిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పారు. ఆస్తి నష్టం కూడా పెద్దగా వాటిల్లలేదని అధికారులు గుర్తించారు.