వై నాట్ 175.. కొద్ది రోజుల క్రితం వరకూ వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ నినాదం ఇది. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాల్లో పార్టీని గెలిపించుకున్న నాయకుడి నోటి నుంచి వచ్చిన మాట అది. తన పాలన పట్ల ప్రజలు ఎంత సానుకూలంగా ఉన్నారో చెప్పడం కోసం జగన్ ఉపయోగించిన నినాదం అది. నిజానికి 175కి 175 గెలుస్తామని కాదు గానీ.. కార్యకర్తల్లో జోష్ నింపడం కోసం.. తమ పాలన పట్ల ప్రజల్లో నమ్మకం మరింత పెరిగిందని చెప్పడం కోసం జగన్ వ్యూహాత్మకంగా వై నాట్ 175 అనేవారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌తోపాటు ఇంకెవరు కలిసి వెళ్లినా తనకు వచ్చిన నష్టమేం లేదనే ధీమా జగన్‌ది. తను అమలు చేసిన సంక్షేమ పథకాలే తనను మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయని జగన్ ఇప్పటికీ ధీమాతో ఉన్నారు. అయితే జగన్ సొంత పార్టీలో, సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఆరు నెలల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించి మరీ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. దీంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడకుండా టీడీపీ ప్రయోజనం చేకూర్చారనే కారణంతో ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిని వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నలుగురిలో శ్రీదేవి మినహా మిగతా ముగ్గురు జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కావడం గమనార్హం. జగన్‌కు మామ వరుసయ్యే బాలినేని శ్రీనివాస రెడ్డి సైతం గత కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. వైవీ సుబ్బారెడ్డి దూకుడుతో తనకు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారనే భావనలో ఆయన ఉన్నారు. జగన్ అంటే తమ కుటుంబానికి ఎంతో ప్రేమన్న బాలినేని.. అటువైపు నుంచి కూడా ఆ ప్రేమలు ఉండాలన్నారు. తద్వారా జగన్‌కు తమ పట్ల అంత ప్రేమ లేదని చెప్పకనే చెప్పారు. ఆ తర్వాత ఏదో కవరింగ్ చేసే ప్రయత్నం చేసినా.. జనాలకు చేరాల్సిన సందేశం చేరిపోయింది.
ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవితోపాటు పార్టీకి రాజీనామా చేయడం. ఈయనేమీ చోటా నేత కాదు. గత ఎన్నికల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఓడించారు. మొదటి నుంచి జగన్ వెన్నంటే ఉంటూ వస్తోన్న ఆర్కేకు మంత్రి పదవి దక్కుతుందని భావించారంతా. కానీ అలాంటిదేం జరగలేదు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కూడా కష్టంగా మారిందని టాక్. గంజి చిరంజీవి మంగళగిరిలో స్పీడ్ పెంచుతుండటంతో నొచ్చుకున్న ఆర్కే ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. కానీ ఎక్కడా జగన్‌కు వ్యతిరేకంగా గానీ, పార్టీకి ఇబ్బంది కలిగేలా కానీ మాట్లాడలేదు. ఆర్కే రాజీనామాతో ఆయన వర్గానికి చెందిన నేతలు కూడా రాజీనామాలు మొదలుపెట్టారు. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. గాజువాక వైఎస్సార్సీపీ ఇంఛార్జ్, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో గాజువాక టికెట్ యాదవ సామాజికవర్గానికి ఇస్తారనే సమాచారంతోనే ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తిప్పల నాగిరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విజయం సాధించారు. జనసేనకు అత్యధిక సభ్యత్వాలున్న నియోజకవర్గంలో, ఆ పార్టీ అధినేతను ఓడించడం అంత ఆషామాషీ వ్యవహారమేం కాదు. అలాంటిది వచ్చే ఎన్నికల నాటికి ఆయన వర్గం వైఎస్సార్సీపీకి దూరమయ్యే పరిస్థితి.
ఇలా జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలే ఆయనకు దూరం అవుతుండటం వైఎస్సార్సీపీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది. ఎన్నికల్లో గెలవాలంటే సంక్షేమ పథకాలు సరిపోతాయనే భావనలో జగన్ ఉన్నారు. కానీ సొంత మనుషులు కూడా ముఖ్యం కదా అనే భావనను ఆ పార్టీ వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇతర సామాజికవర్గాల నేతలు కూడా చాలా మంది అసంతృప్తితో ఉన్న సూచనలు కనిపిస్తున్నాయి. పిల్లి సుభాష్ చంద్రబోస్ లాంటి నేతలు అప్పుడప్పుడూ బయటపడుతున్నప్పటికీ.. ఇంకా బయటికి రాని వారెందరో ఉన్నారనేది ఏపీ రాజకీయాల గురించి, వైఎస్సార్సీపీ వ్యవహారల గురించి బాగా తెలిసిన వారి మాట. చాలా నియోజకవర్గాల్లో గ్రూపుల వారీగా నేతలు విడిపోయారు. ఈ గ్రూపు రాజకీయాలు, సొంత మనుషుల్లా ఆదరించిన నేతలు దూరం అవుతుండటం.. ఇవన్నీ చూశాకైనా జగన్ అప్రమత్తం కావాలని ఆయన శ్రేయోభిలాషులు కోరుతున్నారు. మరి జగన్ మనసులో ఏముందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa