దుబాయ్ వేదికగా జరుగుతోన్న ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు కాప్-28(COP28)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ వేదికపైకి 12 ఏళ్ల భారతీయ చిన్నారి ప్లకార్డుతో దూసుకొచ్చింది. ‘శిలాజ ఇంధనాలకు ముగింపు పలకండి.. మన భూగ్రహాన్ని, భవిష్యత్తును కాపాడండి’ అనే ప్లకార్డుతో మణిపూర్‌కు చెందిన లిసిప్రియా కంగుజం అనే బాలిక వేదికపైకి వచ్చింది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని వ్యతిరేకిస్తోన్న ఈ పర్యావరణ ప్రేమికురాలు.. దుబాయ్ వేదికగా జరుగుతోన్న కాప్ సదస్సులో కూడా తన గళాన్ని వినిపించింది. సదస్సులో వీక్షకుల మధ్య నుంచి లిసిప్రియా ప్లకార్డుతో వేదికపైకి దూసుకెళ్లి.. శిలాజ ఇంధనాలకు వ్యతిరేకంగా మాట్లాడింది. అయితే, కొద్దిసేపటి తర్వాత నిర్వాహకులు సర్దిచెప్పి ఆమెను కిందకు పంపించే ప్రయత్నం చేశారు. కానీ వారి మాటను లెక్కచేయకుండా వేదికపై అటూ ఇటూ తిరుగుతూ తన ప్రసంగాన్ని కొనసాగించింది. దీంతో సిబ్బంది ఆమెను బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లాల్సి వచ్చింది. కానీ, ఆ చిన్నారి ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. ఆలోచింపజేసే ఆ ప్రసంగానికి వీక్షకుల అభినందనలు దక్కాయి.
ఈ సంఘటనపై కాప్ 28 డైరెక్టర్ జనరల్ అంబాసిడర్ మజిద్ అల్ సువైదీ స్పందిస్తూ.. ఆ చిన్నారి ఉత్సాహాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని అన్నారు. మరోవైపు, నిరసన అనంతరం లిసిప్రియా ట్వీట్ చేశారు. ‘నేను నిరసన తెలపడంతో నన్ను 30 నిమిషాల పాటు అదుపులోకి తీసుకున్నారు.. పర్యావరణానికి సంక్షోభానికి కారణమైన శిలాజ ఇంధనాలను వాడొద్దని చెప్పడమే నేను చేసిన నేరం.. అందుకే నన్ను కాప్-28 నుంచి గెంటేశారు’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘శిలాజ ఇంధనాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు నా బ్యాడ్జ్‌ను నిలిపివేయడానికి కారణం ఏమిటి? మీరు నిజంగా ఆ ఇంధనాలను వ్యతిరేకించేవాళ్లైతే నాకు మద్దతుగా నిలవండి.. నిబంధలకు విరుద్ధంగా ఐరాస ప్రాంగణంలోనే బాలల హక్కుల ఉల్లంఘన జరిగింది.. ఐరాస వేదికపై నా గళాన్ని వినిపించే హక్కు ఉంది’ అని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, క్లైమేట్ ఛేంజ్ ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ సిమోన్ స్టెల్‌లను ట్యాగ్ చేసింది.
నవంబర్ 30 నుంచి డిసెంబరు 12 వరకూ జరిగే కాప్ 28 సదస్సుకు 190 దేశాల నుంచి 60 వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. మణిపూర్ చిన్నారి లిసిప్రియా తూర్పు తైమూర్ ప్రత్యేక రాయబారిగా సదస్సుకు హాజరైంది. చిన్నవయసు నుంచే వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వంటి అంశాలపై ఉద్యమిస్తోంది. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఉపన్యాసాలిచ్చింది. ‘క్లైమేట్ ఛేంజ్ లా’ తీసుకురావాలంటూ భారత పార్లమెంటు ఎదుట ప్లకార్డులు ప్రదర్శించి గళం వినిపించింది. అంతేకాదు, ‘వరల్డ్ చిల్డ్రన్ పీస్ ప్రైజ్ 2019కు ఎంపికయ్యింది.