తనకు విడాకులు కావాలంటూ కోర్టుకెక్కిన నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో కింది ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఒమర్ అబ్దుల్లాపై ఆయన భార్య పాయల్ అబ్దుల్లా చూపిన క్రూరత్వం ఏమీ లేదని.. దీంతో వారికి విడాకులు ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.
ఒమర్ అబ్దుల్లా దాఖలు చేసిన పిటిషన్‌లో తన భార్య ఆయనపై క్రూరంగా ప్రవర్తించింది అనడానికి ఎలాంటి స్పష్టమైన ఆరోపణలు లేవని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. దీంతోపాటు కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై వేసిన అప్పీల్ పిటిషన్‌లో కూడా ఎలాంటి మెరిట్స్ లేవని పేర్కొంది. దీంతో విడాకులు మంజూరు చేయాలంటూ ఒమర్ అబ్దుల్లా వేసిన ఈ అప్పీల్‌ను డిస్మిస్ చేస్తున్నామని జస్టిస్ సంజీవ్ సచ్‌దేవ, జస్టిస్ వికాస్ మహాజన్‌లతో కూడిన ఢిల్లీ హైకోర్టు ద్వి సభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. గత కొంత కాలంగా ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య పాయల్ అబ్దుల్లా మనస్పర్దలు చెలరేగడంతో వారు ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒమర్ అబ్దుల్లా తమకు విడాకులు మంజూరు చేయాలని కోరుతూ కోర్టుకెక్కారు. అయితే పాయల్ అబ్దుల్లా.. రాజస్థాన్ కాంగ్రెస్ అగ్రనేత సచిన్ పైలట్ సోదరి కావడం గమనార్హం.
మరోవైపు.. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా కుమార్తె, ఒమర్ అబ్దుల్లా సోదరి అయిన సారా అబ్దుల్లాను సచిన్ పైలట్ ప్రేమ వివాహం చేసుకోవడం మరో విశేషం. అయితే సచిన్ పైలట్, సారా అబ్దుల్లా కూడా విడాకులు తీసుకున్నట్లు ఇటీవలె తెలిసింది. రాజస్థాన్ ఎన్నికల సందర్భంగా సచిన్ పైలట్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో ఈ విషయం వెల్లడైంది. ఎన్నికల అఫిడవిట్‌లో లైఫ్ పార్ట్‌నర్ గురించి వివరాలు అడిగిన స్థానంలో డైవర్స్‌డ్ అని సచిన్ పైలట్ పేర్కొనడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే సచిన్ పైలట్, సారా అబ్దుల్లా ఎప్పుడు విడిపోయారు అనేది మాత్రం తెలియరాలేదు. 46 ఏళ్ల సచిన్ పైలట్.. తన భార్య నుంచి విడిపోయిన విషయాన్ని ఇప్పటివరకు బహిరంగంగా వెల్లడించలేదు.