వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ..... , చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దుర్మార్గులను పెట్టి ప్రజలను బెదిరించి, భయపెట్టి రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగించేవాడని, వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా, పేదరికం మాత్రమే చూసి సంక్షేమం అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో జగన్ ఒక్కరేనని వెల్లడించారు. రూ. 2 లక్షల 40 వేల కోట్లు మేరకు సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ అందజేసారని, దీని కోసం ఏ ఒక్కరైనా ఎవరికైనా ఒక్క పైసా లంచం ఇచ్చారా అని ధర్మాన ప్రజలను ప్రశ్నించారు. ఆకలి చూసి, కన్నీరు తుడవడమే సీఎం జగన్ కు తెలుసునని, చంద్రబాబులా రాజకీయాలు చేసి లబ్ధిదారుల ఎంపిక ఏనాడూ చేయలేదని, ఆత్మగౌరవంతో పథకాలు తీసుకునేలా పాలన సాగిస్తున్నారని కొనియాడారు. పేదలకు గూడు, నీడ కల్పించాలన్న లక్ష్యంతో రూ. 12,800 కోట్లతో భూమి కొనుగోలు చేసి 32 లక్షల ఇళ్లు నిర్మాణం చేయడానికి ముఖ్యమంత్రిగా జగన్ సంకల్పించారన్నారు. చంద్రబాబు గతంలో హామీలు ఇచ్చి అమలు చేయకుండా, ఇప్పుడు రాజమండ్రికి వచ్చి వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే జగన్ కంటే ఎక్కువ సంక్షేమం అందిస్తానని చెబుతున్నాడని ఎద్దేవా చేసారు. అధికారం ఇచ్చినపుడు నమ్మిన వారిని బాబు వంచించాడని, ఇప్పుడు అధికారం ఇమ్మని అడగడానికి బాబుకు ఏ అర్హత ఉందని ధర్మాన ధ్వజమెత్తారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పాలనాపరమైన శాశ్వత సంస్కరణలను వైయస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టి పారదర్శకతను తీసుకువచ్చారన్నారు. నాడు - నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను, జగనన్న ఆరోగ్య సురక్ష, ఆరోగ్య శ్రీ వంటి పథకాలతో జగన్ తీసుకువస్తున్న మార్పులు కేవలం ఓట్ల కోసం మాత్రం కాదని, ప్రజల జీవన స్థితుగతులు మార్చడానికేనని ధర్మాన ఉద్ఘాటించారు. చంద్రబాబు హయాంలో ఎరువుల బ్లాక్ మార్కెట్, విత్తనాల కోసం రైతుల క్యూల్లో కొట్లాట వంటి ఘటనలు జరిగేవని, జగన్ పాలనలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రామగ్రామాన రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి, రుణాలను మంజూరు చేసి ఆదుకుంటున్నారని వివరించారు. పర్ క్యాపిటా, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం గతంలో అట్టడుగు స్థానాల్లో ఉండగా, జగన్ ముఖ్యమంత్రి కాగానే దేశంలోనే అద్భుతంగా రాణించి ముందు వరుసలోకి వచ్చాయని వివరించారు. రోడ్లు ఎక్కడైతే అధ్వాన్నంగా ఉన్నాయో, వాటి స్థానంలో కొత్త రోడ్లను త్వరలోనే నిర్మాణం చేస్తామని ప్రకటించారు.