వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ, బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముెఖ్యమంత్రి జగన్ పరిపాలన సాగిస్తూ ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి, అభివృద్ఝికి పాటుపడుతున్నారని వెల్లడించారు. సంపద, అధికారం, విద్య, వైద్యం,వ్యవసాయం అందరికీ సమానంగా అందాలన్నది రాజ్యాంగలక్ష్యం కాగా, పెత్తందార్లు పేదలకు వాటిని అందివ్వకుండా తొక్కిపెట్టి అరాచక పాలన సాగించేవారని, కానీ గత నాలుగున్నరేళ్ల కాలంలో జగన్ అట్టడుగు వర్గాల సాధికారతకు చర్యలు తీసుకున్నారని గుర్తు చేసారు. సమాజంలో మార్పు రావాలని, అన్ని వర్గాల్లోనూ, అన్ని స్థాయిల్లోనూ మార్పు తీసుకురావాలన్నదే తన లక్ష్యమని జగన్ ప్రమాణ స్వీకారం నాడే ఉద్ఘాటించారన్నారు. పేదలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవితం అందించేందుకు ఉన్న అడ్డంకులన్నింటినీ తొలగించి జగన్ మందడుగు వేస్తున్నారని, గతంలో టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలదే రాజ్యంగా ఉండేదని గుర్తు చేసారు. అర్హతే ప్రామాణికంగా తీసుకుని సంక్షేమ పథకాలను జగన్ అందిస్తున్నారని వివరించారు. జగన్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం పట్ల దమ్ముతో పని చేస్తోందని, లోపాలుంటే టీడీపీ నేతలు చూపాలని సవాల్ చేసారు. సంక్షేమ పథకాల అమల్లో పైసా లంచం తీసుకున్నట్లు రుజువు చేస్తే నా పదవికి ఈ వేదిక మీదే రాజీనామా చేస్తానని సీతారామ్ టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. పేదలకు సంపదలో భాగస్వామ్యం కల్పించి జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చారని కొనియాడారు. చరిత్ర ఉన్నంత కాలంలో జగన్ ను మరిచి పోరాదని, తప్పు చేస్తే దేవుడు కూడా క్షమించడని హితవు పలికారు. మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ ఎన్నిక కావాల్సిన చారిత్రక కర్తవ్యం గా ప్రజలు గుర్తుపెట్టుకోవాలని కోరారు.