2019లో చంద్రబాబు టీడీపీ అభ్యర్థుల్ని మార్చుకోలేదా అని మంత్రి మేరుగ నాగార్జున నిలదీశారు. శుక్రవారం సచివాలయం వద్ద మంత్రి మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో వెతుక్కునే తత్వం, అడుక్కునేతత్వం చంద్రబాబుదని ధ్వజమెత్తారు. మా వైపు ఒక వేలు చూపితే నాలుగు వేళ్లు ఆయన వైవే చూపిస్తున్నాయని చంద్రబాబు గమనించాలన్నారు. ఆడలేక మద్దెల ఓడ అన్నట్టుంది చంద్రబాబు తీరు అని మంత్రి ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయించేందుకు అప్పుతెచ్చుకుందామన్నా చంద్రబాబుకు అభ్యర్థులు దొరకడం లేదని విమర్శించారు. మమ్మల్ని ఎక్కడైనా పోటీ చేయించే దమ్ము సీఎం వైయస్ జగన్‌కు ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఎస్సీ స్థానాల్లో ఎస్సీలను కాకుండా ఓసీలను పోటీకి పెట్టడం లేదు కదా అని ప్రశ్నించారు. లోకేష్ మంగళగిరిలో ఎందుకు పోటీ చేస్తున్నారు. బీసీలు పోటీ చేసే చోట చంద్రబాబు, లోకేష్ ఎందుకు పోటీ చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చేస్తున్న వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్రంలో చాలా బలంగా ఉందని, మా పార్టీ టిక్కెట్ల కోసం సీఎం వైయస్ జగన్ వద్ద అభ్యర్థులు బారులు తీరుతున్నారని చెప్పారు. పార్టీ సౌలభ్యం కోసమే మేం ముందుకు వెళ్తున్నామని మేరుగు నాగార్జున పేర్కొన్నారు. నేను రాజకీయాల్లోకి వచ్చిందే వైయస్‌ఆర్ కోసమన్నారు. వైయస్‌ఆర్ తరువాత సీఎం వైయస్ జగన్ బొమ్మ పెట్టుకుని పోటీ చేశామని గర్వంగా చెప్పారు. సీఎం వైయస్ జగన్ వల్లే నాకు గుర్తింపు, మర్యాద పెరిగిందని స్పష్టం చేశారు. సీఎం వైయస్ జగన్ మాట నాకు వేదం..వైయస్ జగన్ లేకపోతే నేను శూన్యమని తెలిపారు. జగనన్న జెండా మోసే ఏ నాయకుడినైనా క్యాడర్ ఆదరిస్తారని మంత్రి నాగార్జున ఉద్ఘాటించారు.