అనకాపల్లి జిల్లా, యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం పంచదార్ల క్యాంప్ సైట్ నుంచి 223వ రోజు పాదయాత్ర మొదలైంది. టీడీపీ, జనసేన నేతలు పాదయాత్రలోపాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా గొర్లె ధర్మవరం గ్రామస్తులు యువనేతను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గొర్లె ధర్మవరం గ్రామస్తులు మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చాక తమ పంచాయతీ నిధులను అభివృద్ధి పనులకు ఉపయోగించడం లేదన్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారన్నారు. గత నాలుగు సంవత్సరాల్లో తమ గ్రామంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని గ్రామస్తులు తెలిపారు. నారా లోకేష్ స్పందిస్తూ.. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలను భ్రష్టుపట్టించారన్నారు. 14, 15 ఆర్థిక సంఘం పంచాయతీలకు ఇచ్చిన రూ.9వేల కోట్లను జగన్ ప్రభుత్వం దొంగిలించిందని.. దీంతో పంచాయతీల్లో కనీసం బ్లీచింగ్ చల్లేందుకు కూడా చిల్లిగవ్వ ఇవ్వడం లేదన్నారు. అధికారంలోకి వచ్చాక గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అదనపు నిధులు కేటాయిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.