ఉమ్మడి విశాఖ జిల్లాలో రంగురాళ్ల కోసం తవ్వకాలు జరుగుతున్నాయి. కరక కొండపై ఎత్తయిన బేస్‌క్యాంప్‌లో అటవీ సిబ్బంది పహారా కాస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం వేళ బేస్ క్యాంప్‌నకు తూర్పు వైపుగా రాతిపణుకు పక్కన రంగురాళ్ల తవ్వకాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కొండ దిగువ నుంచి సిబ్బందికి సమాచారం అందింది. స్పందించిన సిబ్బంది హుటాహుటిన దాడి చేశారు. వీరి రాకను కొంతదూరం నుంచే గమనించి ఐదుగురు రంగురాళ్లు కోసం తవ్విన మూడు మూటల మట్టిని అక్కడే వదిలేసి పారిపోయేందుకు ప్రయత్నించారు.
వెంటనే అటవీ సిబ్బంది వెంబడించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత గాలింపులో మరొకరు దొరికిపోయారు. వీరిద్దరిని విచారణ నిమిత్తం ఆదివారం రాత్రి నర్సీపట్నం కలప డిపోకు తీసుకువచ్చారు. వీరు బుచ్చెయ్యపేట మండలం పొట్టిదొరపాలేనికి చెందిన భవన నిర్మాణకార్మికుడు కె.ప్రసాద్, గొలుగొండ మండలం కొత్త యల్లవరానికి చెందిన జల్లు నూకరాజుగా గుర్తించినట్టు అటవీ సెక్షన్ అధికారి తెలిపారు.
రాతిపణుకు ప్రదేశంలో దాదాపు నాలుగు అడుగుల లోతున తవ్వకాలు చేసి మట్టి మూటలు కట్టారని సిబ్బంది గుర్తించారు. కొద్దిరోజుల క్రితమే తవ్వకాలకు ప్రయత్నాలు జరిగాయని తెలిసి నిఘా కట్టుదిట్టం చేశారు. ఇటీవల నూతనంగా నియమితులైన డీఎఫ్‌వో సిబ్బందితో సమావేశమై తవ్వకాలకు ఎవరు ప్రయత్నించినా ఉపేక్షించవద్దని ఆదేశించారు. నిఘా పెంచినా సరే.. కరక కొండపై విలువైన రంగురాళ్ల కోసం అక్రమార్కుల వేట కొనసాగుతూనే ఉంది. ఇక్కడ లభించే వైడూర్యాలు ఎంతో విలువైనవి కావడంతో వాటికోసం ఎంతకైనా తెగిస్తున్నారు. అటవీ సిబ్బంది పహారా కాస్తుండగానే తమ పని కానిచ్చేస్తున్నారు. నిఘా సిబ్బంది కళ్లుగప్పి కొండపైకి చేరి తవ్వేస్తున్నారు. దీంతో ఉన్నతాధికారులు నిఘా కట్టుదిట్టం చేయాలని ఆదేశాలిచ్చారు. అయినా అక్రమ తవ్వకందారులు మళ్లీ తవ్వకాలు చేస్తున్నారు.