‘టిడ్కో’ నిధులు మళ్లించారనే ఆరోపణల నేపథ్యంలో తనను అరెస్టు చేసే అవకాశముందని ఈ క్రమంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ కేసులో నిందితుడు యోగేశ్ గుప్తా దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. టిడ్కో నిధుల దుర్వినియోగంపై ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదని సీఐడీ అధికారులు చెబుతున్నారని న్యాయస్థానం తెలిపింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ముందుస్తు బెయిల్ కోరడంపై అభ్యంతరం తెలిపింది. మందస్తు బెయిల్ మంజూరుకు సహేతుక కారణాలు ఉండాలని చట్టనిబంధనలు చెబుతున్నాయని పేర్కొంది. టిడ్కో ఇళ్లకు సంబంధించిన నిధుల కుంభకోణం ఆరోపణలతో సీఐడీ కేసు నమోదు చేసినట్లు పిటిషనర్ ఎలాంటి ఆధారాలూ చూపించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. యోగేశ్ గుప్తా ఆందోళనకు సహేతుకమైన కారణాలు లేవని పేర్కొంది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. మల్లికార్జునరావు తీర్పు ఇచ్చారు.