నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో సముద్రం నుంచి తమిళనాడు, దానికి ఆనుకుని రాయలసీమ, కోస్తాపైకి తేమగాలులు వీస్తున్నాయి. దీంతో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో శనివారం చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా సముద్రం నుంచి వీచిన తేమ గాలులతో అనేకచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా, ఉత్తర కోస్తాలో తక్కువగా నమోదయ్యాయి. శనివారం కళింగపట్నంలో 17.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.