విద్యుత్ పంపిణీ సంస్థలలో సంప్రదాయ ఇంజనీరింగ్ అధికారుల పోస్టులు కాకుండా కొత్తగా ఎనర్జీ అసిస్టెంట్ల్లు, మేనేజర్ల నియామకాలు చేపట్టాలన్న ప్రతిపాదన చిచ్చు రేపుతోంది. రాష్ట్రంలోని 3,678 గ్రామ/వార్డు సచివాలయాల్లో నియమించిన 1910 మంది ఎనర్జీ అసిస్టెంట్ల సర్వీసును క్రమబద్ధీకరించడంతో పాటు కొత్తగా 1768 ఎనర్జీ అసిస్టెంట్, 36 జూనియర్ మేనేజర్ గ్రేడ్-2, 35 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతులు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఏపీసీపీడీసీఎల్ కోరింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో ఈ నియామకాలు చేపట్టేందుకు అనుమతులు ఇవ్వాలని కోరింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశాలు కనిపిస్తుండటంతో విద్యుత్ రంగ సంస్థలలో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఉద్యోగులకు, కొత్తగా నియమితులయ్యే ఎనర్జీ అసిస్టెంట్లు, జూనియర్ మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లకూ మధ్య జీతభత్యాలలో భారీ వ్యత్యాసం ఉండటంతో భవిష్యత్తులో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సంస్థలలో జూనియర్ ఇంజనీర్ గ్రేడ్-2 పోస్టు ప్రభుత్వ శాఖల్లో టెక్నీషియన్‌గా ఉం టోంది. గ్రేడ్-5గా ఉన్న వీరి జీతభత్యాలు నెలకు రూ. 23,120-74,770గా ఉన్నాయి. జూనియర్ ఇంజనీరు గ్రేడ్-1 పోస్టులకు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లుగా గ్రేడ్-8 కింద రూ.34,580-1,07,210 దాకా జీతభత్యాలు ఉన్నాయి. జూనియర్ మేనేజర్ గ్రేడ్-2 పోస్టులకు కూడా జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లుగా జీతభత్యాలు రూ.34,580-1,07,210 ఉన్నాయి. విద్యుత్ సంస్థలలో జూనియర్ మేనేజర్ గ్రేడ్-1లో అసిస్టెంట్ ఇంజనీరుకు సమాన హోదాలో జీతాభత్యాలు రూ.48,440-1,37,220 అందుతాయి. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-2లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు స్థాయిలో రూ.57,100-1,47,760 దాకా వస్తాయి. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-1 ఉద్యోగులకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు స్థాయిలో రూ.65,350-1,54,980 వరకూ జీతభత్యాలు లభిస్తాయి. మేనేజరుకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు స్థాయిలో రూ.76,730-1,62,790 దాకా అందుతాయి. అదేవిధంగా చీఫ్ జనరల్ మేనేజర్‌కు చీఫ్ ఇంజనీరు స్థాయిలో రూ.1,24,380- 1,79,000 దాకా జీతభత్యాలు అందుతాయి. శనివారం కడపలో విద్యుత్ సంస్థల రాష్ట్ర కార్యనిర్వాహక ఇంజనీర్ల అసోసియేషన్ అధ్యక్షుడు సునీల్‌దత్ అధ్యక్షతన సమావేశం జరిగింది. విద్యుత్ సంస్థలలోని ఖాళీలను పాత విధానంలోనే భర్తీ చేయాలని ఈ సమావేశంలో డిమాండ్ చేశారు.