మూడు రాజధానులకు వ్యతిరేకంగా మొక్కవోని దీక్షతో అమరావతి రాజధాని రైతులు చేపట్టిన ఉద్యమం ఆదివారం నాటికి నాలుగేళ్లు పూర్తియింది. రాజధాని రైతులు మొక్కవోని దీక్షతో ఉద్యమం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. కేసులు, జైళ్లను సైతం లెక్క చేయకుండా తమకు న్యాయం చేయాలని నినదిస్తు దీక్షలు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో శిబిరాలు.. మహిళలే ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఒకవైపు ఉద్యమం.. మరో వైపు న్యాయపోరాటం చేస్తున్నారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే చట్టం రద్దు బిల్లులు చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ లోపే జగన్ ప్రభుత్వం బిల్లులను ఉపసంహరించుకుంది.దీంతో ఏపీ ప్రభుత్వం హైకోర్ట్ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. రాజధానిలో ఆర్ -5 జోన్‌ను కూడా రైతులు సవాల్ చేశారు. క్యాంప్ కార్యాలయంలో ముసుగులో ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై కూడా హైకోర్టులో రైతులు పిటీషన్ వేశారు. కాగా రైతులను ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బంది పెడుతోంది. గత ఏడాది కౌలును సీఆర్డీయే ఇంతవరకూ ఇవ్వలేదు. పంటలపై ఫలసాయం లేక, కౌలు రాక, ఆదాయం లేక రాజధాని రైతులు కుటుంబ ఖర్చుల కోసం అల్లాడుతున్నారు. కొలు కోసం అధికారులు జీవో జారీ చేసి నిధులు విడుదల చేయలేదు. ఎండా, వానను లెక్క చేయకుండా రాజధాని మహిళ రైతులు ఉద్యమం చేస్తున్నారు. మొక్కవోని దీక్షతో తమ హక్కుల కోసం దీక్ష చేస్తున్న మహిళ రైతులను పలు రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు అభినందించాయి. రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాల సారవంతమైన భూమిని నయాపైసా తీసుకోకుండా రైతులు ఇచ్చారు. రైతుల త్యాగాలను వైసీపీ ప్రభుత్వం విస్మరించింది. అమరావతికే మా మద్దతు అని ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు రాజధానుల చట్టం తెచ్చి.. నమ్మించి మోసం చేశారని ఆందోళన వ్యక్తం చేస్తూ.. రాజధాని రైతులు న్యాయ పోరాటం చేపట్టారు.