గత కొద్ది రోజుల నుంచి గతంలో ఎన్నడూ లేనివిధంగా శబరిమల భక్తులు పోటెత్తుతుండటంతో దర్శనానికి తీవ్ర ఎదుర్కొంటున్నారు. సన్నిధానం నుంచి పంబ వరకూ క్యూలైన్లు విస్తరించి.. వేలాది మంది మండుటెండలో పడగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో శబరిమలలో భక్తుల ఇబ్బందులపై కేంద్రం స్పందించింది. అయ్యప్ప భక్తులు శబరిమలలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి సరైన సౌకర్యాలను కల్పించి, దర్శనం సాఫీగా జరిగేలా చూడాలని కేరళ ప్రభుత్వాన్ని కోరింది. కేంద్రం తరఫున అవసరమైన సాయం అందజేస్తామని పేర్కొంటూ ఈ మేరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి శనివారం లేఖ రాశారు.
ఇటీవల తొక్కిసలాటలో బాలిక చనిపోవడం బాధాకరమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అవసరమైనంత మేర పోలీసులు, సిబ్బందిని నియమించాలని, యాత్ర మధ్యలో అవసరమైన వైద్య సహాయం చేయాలని కోరారు. ‘శబరిమల ఆలయం, అయ్యప్ప స్వామి భక్తులు చేపట్టిన 40 రోజుల ఆధ్యాత్మిక యాత్ర హిందూ విశ్వాసంలో అత్యంత గౌరవనీయమైన విశ్వాస వ్యవస్థలలో ఒకటిగా పరిగణింపబడుతుంది. నవంబర్-జనవరి మధ్య మండల పూజల సీజన్‌లో దాదాపు కోటి మంది భక్తులు కొండపైకి వస్తారు.. వారిలో తాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికులు 15 లక్షలకు పైగా ఉంటారు’ తన లేఖలో తెలిపారు.
భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారనే నివేదికలు, సన్నిధానం వద్ద చాలాసేపు వేచి ఉండటం.. దర్శనం కోసం వేచి ఉండగా ఇటీవల ఒక చిన్నారి చనిపోవడం కూడా చాలా వేదన.. బాధను కలిగించింది. ఈ నేపథ్యంలో భక్తులు దర్శనం కోసం వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గేలా తగిన సిబ్బంది నియమించాలి.. అలాగే, శబరిమల యాత్రలో భక్తులకు ఆహారం, నీరు, పరిశుభ్రమైన పారిశుద్ధ్య సౌకర్యాలు, వైద్య సహాయం వంటి కనీస సౌకర్యాలు కల్పించాలి’ అని మంత్రి చెప్పారు. శబరిమలలో సరైన చర్యలు చేపట్టాలని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌కు విజ్ఞప్తి చేశారు.