మధ్యధరా సముద్రంలో డజన్ల కొద్దీ వలస వాదులతో వెళ్తున్న పడవ ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 60 మందికి పైగా వలస వెళ్తున్న ప్రజలు దుర్మరణం పాలయ్యారు. మధ్యధరా సముద్రంలోని ఒక మార్గం ద్వారా అక్రమంగా వలసదారులు ఐరోపా దేశాల్లోకి ప్రవేశిస్తూ ఉంటారు. అయితే తరచూ ఈ మార్గంలో ప్రమాదాలు జరుగుతుండటంతో ఏటా వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా వలస వాదుల వలసలు మాత్రం ఆగడం లేదు. తాజాగా లిబియాలో జరిగిన పడవ ప్రమాదంలో 60 మందికిపైగా ప్రాణాలు కోల్పోవడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పదుల కొద్దీ వలసదారులతో ఐరోపాకు బయలుదేరిన ఓ పడవ లిబియా తీరం వద్ద మధ్యధరా సముద్రంలో బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు 60 మందికి పైగా మరణించినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ వెల్లడించింది. ఈ 60 మంది మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు పేర్కొంది. లిబియా పశ్చిమ తీరంలోని జువారా పట్టణం తీరంలో వచ్చిన బలమైన అలల తాకిడికి పడవ కొట్టుకుపోయినట్లు ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారు అధికారులకు తెలిపారు.
తాజాగా ఘటన జరిగిన మధ్యధరా సముద్రంలోని ఆ ప్రాంతంలో గతంలో కూడా చాలా పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. పేదరికాన్ని తట్టుకోలేక ఆకలి బాధలతో చాలా మంది ఆఫ్రికా దేశాల ప్రజలు ఐరోపా దేశాలకు వలస వెళ్తూ ఉంటారు. అలాంటి వారు ఈ మార్గం గుండానే ఐరోపా దేశాలకు అక్రమంగా వెళ్తున్నారు. యుద్ధాలు, పేదరికం కారణంగా పశ్చిమ ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచి ప్రతీ సంవత్సరం వేలాది మంది ఐరోపాకు వలస వెళ్తున్నారు. అలాంటివారికి లిబియా ప్రధాన రవాణా కేంద్రంగా మారింది. దశాబ్దాల పాటు లిబియాను పాలించిన నియంత గడాఫీ మృతి తర్వాత అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు దాదాపు 2,250 మంది మరణించినట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఇక లిబియాలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితులను మానవ అక్రమ రవాణాదారులు అనుకూలంగా మార్చకున్నారు. 6 దేశాలతో సరిహద్దులు పంచుకుంటున్న లిబియాలోకి ఆఫ్రికా దేశాల నుంచి వలసదారులు భారీగా చేరుకుంటున్నారు. చిన్న చిన్న పడవల్లో పరిమితికి మించి ఎక్కించి తీరం దాటిస్తున్నారు. ఇక ఎవరైనా పట్టుబడి తిరిగి లిబియాకు వస్తే.. వారిని ప్రభుత్వ నిరాశ్రయ కేంద్రాల్లో బంధించి వారిని నిర్బంధ శ్రామికులుగా మారుస్తున్నారు. అలాగే వీరిపై అత్యాచారాలు చేస్తున్నారు. వీటన్నింటితోపాటు దేశాన్ని విడిచి వెళ్లేటప్పుడు వారి వద్ద ఉన్న డబ్బును లాగేసుకుంటున్నట్లు ఐక్యరాజ్యసమితి నియమించిన అధికారుల బృందం గుర్తించింది.