హాస్పిటల్‌లోనే డాక్టర్లు మందేసి చిందులు వేసిన ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్లు.. అదే ఆస్పత్రి ఆవరణలో మందు పార్టీ చేసుకోవడం విమర్శలకు దారి తీసింది. అయితే మద్య నిషేధం అమల్లో ఉన్న బిహార్‌లో ఈ ఘటన జరగడం గమనార్హం. అయితే డాక్టర్లు.. ఆస్పత్రిలోనే మందు పార్టీ చేసుకున్న ఘటన బయటికి రావడంతో తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. బిహార్‌లోని దర్భంగా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈనెల గురువారం నుంచి ఆదివారం వరకు దర్భంగా మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో పెడికాన్ 2023 సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆస్పత్రి ప్రాంగణంలోని గెస్ట్‌హౌస్‌లో మందు పార్టీ ఏర్పాటు చేశారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎన్ మిశ్రాతో సహా పలువురు డాక్టర్లు ఈ మందు పార్టీలో పాల్గొన్నారు. కాగా ఈ విషయం తెలిసిన కొందరు హాస్పిటల్‌లోని గెస్ట్‌హౌస్‌లోకి వెళ్లి చూడగా.. ఈ సంఘటన చోటు చేసుకుంది.
అయితే వారంతా డాక్టర్లు మందు పార్టీ చేసుకోవడాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే వీడియో తీయడాన్ని చూసిన ఆ డాక్టర్లు అంతా మెల్లగా అక్కడి నుంచి పరారయ్యారు. అక్కడ ఫారిన్ మద్యం సీసాలు, మద్యం సేవించిన గ్లాసులు ఉన్న ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అయితే మద్యం అమ్మకాలు, కొనుగోలుపై నిషేధం ఉన్న బిహార్‌లో జరిగిన ఈ సంఘటనపై స్థానిక రాజకీయ నాయకులతోపాటు నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మద్య నిషేధ చట్టం కేవలం కొంత మంది ప్రజలకే వర్తిస్తుందా అని సీఎం నితీశ్ కుమార్ లక్ష్యంగా జనం ప్రశ్నలు గుప్పిస్తున్నారు.
చిన్నప్పుడే పిల్లలలో ఆరోగ్యవంతమైన సంబంధాలను ఏర్పరచడం ఎలా..! మరోవైపు ఈ విషయం దర్భంగా పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు రంగంలోకి దిగారు. సంఘటనా స్థలంలోకి చేరుకున్న పోలీసులు.. 3 ఫారిన్ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను పరిశీలిస్తున్నామని సంబంధిత వ్యక్తులను ప్రశ్నిస్తామని దర్భంగా పోలీస్ అధికారులు వెల్లడించారు.