ఐరాస భద్రతామండలి ఓ 'పాత క్లబ్బు' వంటిదని, అందులో సభ్యదేశాలు కొత్త దేశాలకు చోటు ఇవ్వడానికి అయిష్టత ప్రదర్శిస్తుంటాయని
భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ విమర్శించారు. బెంగళూరులో రోటరీ ఇన్ స్టిట్యూట్-2023 కార్యక్రమంలో మాట్లాడుతూ జై శంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పాత క్లబ్బు సభ్యులు తమ విధానాలను సమీక్షించుకోవడానికి కూడా ఇష్టపడరని జై శంకర్ వ్యాఖ్యానించారు. "ఆ సభ్యులు తమ పట్టు సడలిపోవడాన్ని ఏమాత్రం అంగీకరించరు... భద్రతామండలిపై తమ పెత్తనమే కొనసాగాలని కోరుకుంటారు. కొత్త సభ్యదేశాలు భద్రతామండలిలోకి వస్తే తమ విధానాలను ప్రశ్నిస్తాయని వారికి భయం. ఇవాళ మానవాళికి అనేక సమస్యలు హానికరంగా మారాయి. ప్రపంచం ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఐక్యరాజ్యసమితి ఏమంత ప్రభావం చూపలేకపోతోంది" అని జై శంకర్ వివరించారు.