ఇస్లాం సంస్కృతి.. ఐరోపా నాగరికత, విలువలు, హక్కులకు మధ్య సఖ్యత ఉండదని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వ్యాఖ్యానించారు. తమ పార్టీ అల్ట్రా కన్జర్వేటివ్ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ నిర్వహించిన కార్యక్రమంలో మెలోని ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన యూకే ప్రధాని రిషి సునాక్, బిలియనీర్ ఎలాన్ మస్క్‌లు సమక్షంలోనే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘ఇస్లామిక్ సంస్కృతి లేదా సిద్ధాంతాలు.. మన నాగరికత హక్కులు, విలువల నిర్దిష్ట వివరణల మధ్య అనుకూలత సమస్య ఉందని నేను బలంగా నమ్ముతున్నాను’ అని ఇటలీ ప్రధాని పేర్కొన్నారు.
ఇటలీలోని చాలా ఇస్లామిక్ సాంస్కృతిక కేంద్రాలకు సౌదీ అరేబియా నిధులు సమకూరుస్తుందనే విషయం నా మదిలో నుంచి తొలగిపోలేదని ఆమె అన్నారు. ఈ సందర్భంగా మతివిశ్వాసం లేకపోవడం, స్వలింగ సంపర్కం నేరంగా పరిగణించే సౌదీలో కఠినమైన షరియా చట్టాన్ని కూడా ఆమె విమర్శించారు. కాగా, ఇస్లాం మత గ్రంథాలైన ఖురాన్, హదీథ్‌లలోని సూత్రాలు, నిబంధనల ఆధారంగా షరియా చట్టాలను రూపొందిస్తారు. ‘షరియా అంటే లైంగిక ఇష్టాలకు లాపిడేషన్, మతభ్రష్టత్వం, స్వలింగసంపర్కానికి మరణశిక్ష. వీటిపై గొంతెత్తాలని నేను నమ్ముతున్నాను.. అంటే ఇస్లాంను సాధారణీకరించడం కాదు.. ఐరోపాలో మన నాగరికత విలువలకు చాలా దూరంగా ఉన్న ఇస్లామీకరణ ప్రక్రియ ఉందనే సమస్యను లేవనెత్తడమే’ అని ఆమె అన్నారు.
ఈ సందర్భంగా యూకే ప్రధాని రిషి సునాక్.. మెలోని వలస విధానాన్ని సమర్థించారు. రువాండాకు శరణార్థులను పంపాలనే సునాక్ వివాదాస్పద ప్రణాళిక చట్టపరమైన సవాళ్లు, అమానవీయమైందనే ఆరోపణలను ఎదుర్కొంది. మరోవైపు, మధ్యధరా సముద్రంలో పనిచేస్తున్న ఛారిటీ రెస్క్యూ షిప్‌ల కార్యకలాపాలను పరిమితం చేయడానికి చేసిన ప్రయత్నాలపై మెలోనీ విరుచుకుపడ్డారు. ‘ఈ సమస్యను మనం పరిష్కరించకపోతే సంఖ్యలు మాత్రమే పెరుగుతాయి. ఇది మన దేశాలు, వాస్తవానికి మా సహాయం అత్యంత అవసరమైన వారికి సాయపడే మా సామర్థ్యాన్ని మించిపోతుంది.. ఆ నిరోధకాన్ని విశ్వసనీయమైనదిగా చేయడం అంటే పనులను భిన్నంగా చేయడం.. ఏకాభిప్రాయం నుంచి విచ్ఛిన్నం చేయడం.. జార్జియా, నేను ఇద్దరూ అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని సునాక్ అన్నారు. వలసలపై చర్చించేందుకు ఇరువురు నేతలు అల్బేనియా ప్రధాని ఈడి రామాను కూడా కలిశారు. మరోవైపు, ఇటీవలే ప్రియుడితో పదేళ్ల సహజీవనానికి ఇటలీ ప్రధాని ముగింపు పలికిన విషయం తెలిసిందే. జర్నలిస్ట్, టీవీ వ్యాఖ్యాత అయిన ఆండ్రియా జియాంబ్రూనోవా ఓ షో సందర్భంగా మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే.