మనం సాధారణంగా ఎన్నో రకాల గడియారాలు చూసి ఉంటాం. అయితే అన్ని గడియారాల్లో కెల్లా ఈ గడియారం రూటే సపరేటు. ఎందుకంటే ఇది 10 వేల ఏళ్ల పాటు నడిచే గడియారం. ఈ గడియారం పరిమాణం 500 అడుగులు. అయితే ఏడాదికి ఒకసారి మాత్రమే టిక్ అంటూ ఈ గడియారం శబ్దం చేస్తుంది. ఈ గడియారం తయారు చేయడానికి అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అమెరికా సైంటిస్ట్ తయారు చేయనున్న ఈ గడియారం తయారీకి జెఫ్ బెజోస్ ఆర్థిక భాగస్వామిగా ఉండనున్నారు.
అమెరికాకు చెందిన కంప్యూటర్ సైంటిస్ట్, ఇన్వెంటర్ డానీ హిల్స్ ఈ భారీ గడియారం ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. 1996 లో లాంగ్ నౌ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి ఈ గడియారం నిర్మాణం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. మానవాళి ఎక్కువగా స్వల్పకాల లక్ష్యాల కోసమే పని చేస్తోందని.. దీర్ఘకాల లక్ష్యాల కోసం.. భవిష్యత్తు తరాల కోసం పాటుపడాలనే విషయాన్ని గుర్తు చేయడం కోసమే ఈ గడియారం నిర్మాణం చేపట్టినట్లు డానీ హిల్స్ గతంలోనే ప్రకటించారు. ఈ భారీ గడియారానికి ద క్లాక్ ఆఫ్ ద లాంగ్ నౌ అనే పేరు కూడా పెట్టారు.
అయితే ఈ గడియారం సంవత్సరానికి ఒకసారి మాత్రమే ‘టిక్’ అని శబ్ధం చేస్తుంది. ఈ యాంత్రిక గడియారాన్ని లాంగ్ న్యూ ఫౌండేషన్ అనే సంస్థ అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న కొండలపై ఏర్పాటు చేయనుంది. ఒక గది పరిమాణంలో ఉండే 5 ఛాంబర్‌లు ఈ గడియారంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ 10 వేల సంవత్సరాల్లో మొదటి ఏడాది మొదటి ఛాంబర్.. 10 వ ఏడాది రెండో ఛాంబర్, 100 వ ఏడాది మూడో ఛాంబర్, 1000 వ ఏడాది నాలుగో ఛాంబర్, 10 వేల సంవత్సరం ఐదో ఛాంబర్‌కు కేటాయించారు. అయితే ఆయా కాలాల్లో మానవ చరిత్రను తెలిపే కళా ఖండాలు, సందేశాలు, ముఖ్యమైన విషయాలను ఈ గడియారంలో పొందుపరచనున్నారు. ఇప్పటికే ఈ గడియారం నిర్మాణం మొదలైంది. అమెరికాలోని టెక్సాస్‌కు పశ్చిమంగా సియరా డియాబ్లా పర్వత శ్రేణిలో ఈ భారీ గడియారం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ గడియారం నిర్మాణం పట్ల భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వినూత్న ఆలోచన చేయడాన్ని కొంత మంది మెచ్చుకుంటున్నప్పటికీ.. మరికొంత మంది మాత్రం ఈ గడియారం నిర్మాణానికి పెట్టే ఖర్చుకు బదులు.. ఆ డబ్బును ప్రస్తుతం ప్రపంచం ముందు ఉన్న సమస్యలను తీర్చడానికి ఉపయోగించాలని సూచిస్తున్నారు.
అయితే 10 వేల ఏళ్ల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ గడియారం పని చేస్తుందని డానీ హిల్స్ తెలిపారు. సాధారణ గడియారాల్లాగా నిమిషాలు, గంటల లెక్కన ఇది పని చేయదని.. ఏడాది పూర్తి కాగానే ఈ గడియారంలో ముల్లు ముందుకు కదిలి టిక్ మనే శబ్దం వస్తుందని వివరించారు. ఇక ఒక శతాబ్దం పూర్తి కాగానే ఒక బీప్ శబ్దం వస్తుందని చెప్పారు. ఆ తర్వాత వెయ్యేళ్లు పూర్తి కాగానే ఒక పక్షి బొమ్మ బయటకు వచ్చి సమయం చెప్పేలా ఈ గడియారాన్ని నిర్మిస్తున్నారు. 500 అడుగుల ఎత్తులో నిర్మితం కానున్న ఈ భారీ గడియారం ఒక మెకానికల్ అద్భుతమని.. భూమిలో ఉండే వేడిని విద్యుచ్ఛక్తిగా మార్చుకుని పనిచేస్తుందని తెలిపారు.
ఈ గడియారంలో సోలార్ సింక్రనైజర్, పెండ్యులమ్, కైమ్ జనరేటర్, గేర్లు, డయల్స్ ఉంటాయి. ఇది సంవత్సరాలు, శతాబ్దాలను, సహస్రాబ్దులను లెక్కిస్తుందని చెప్పారు. 35 లక్షల రకాలైన శబ్దాలు చేయగలిగే సామర్థ్యం ఈ గడియారానికి ఉండటం వల్ల ఒక సారి చేసిన శబ్దాన్నే మరోసారి చేయాల్సిన అవసరం లేదని వెల్లడించారు. అయితే ఈ భారీ గడియారం నిర్మాణం విజయవంతం కావడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. వచ్చే 10 వేల ఏళ్లలో ఉష్ణోగ్రతల మార్పులు, తేమ, దుమ్ము ప్రభావాన్ని తట్టుకోవడం, నిర్వహణను బాధ్యతతో చేపడితేనే 10 వేల ఏళ్ల తర్వాత దీని గంట వినపడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.