పార్లమెంటులో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యం ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి నుంచి కీలక విషయాలను రాబడుతున్నారు. ఈ క్రమంలోనే నిందితులు కీలక ఆధారాలను రాజస్థాన్‌లో ధ్వంసం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో పోలీసులు రాజస్థాన్ చేరుకుని అక్కడ కాలిపోయిన సెల్‌ఫోన్ల విడి భాగాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి నుంచి ఏదైనా సమాచారం రాబట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసులో అన్ని వైపుల నుంచి లోతైన దర్యాప్తు జరుపుతున్న ఢిల్లీ పోలీసులు అన్ని రకాల ఆధారాలను సేకరిస్తున్నారు.
పార్లమెంట్ దాడికి సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝా.. ఈ ఘటనకు సంబంధించిన కీలక ఆధారాలను రాజస్థాన్‌లోని నాగౌర్‌లో ధ్వంసం చేసినట్లు ఢిల్లీ పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఈ క్రమంలోనే ఆదివారం రాజస్థాన్ చేరుకుని.. అక్కడ నిందితులకు చెందిన కాల్చేసిన, ధ్వంసం చేసిన ఫోన్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పార్లమెంటులో భద్రతా వైఫల్యం జరగడం, ఆ తర్వాత స్మోక్ దాడికి పాల్పడిన తర్వాత రాజస్థాన్‌కు పారిపోయి వచ్చిన లలిత్ ఝా.. తన స్నేహితుడైన మహేశ్ కుమావత్ ఇంట్లో ఆశ్రయం పొందినట్లు గుర్తించారు.
ఇక ఆ తర్వాత వారిద్దరూ కలిసి నాగౌర్ జిల్లా త్రిశాంగ్య గ్రామంలోని ఓ హోటల్‌లో బస చేశారు. అక్కడే కొద్దిదూరంలో నలుగురు నిందితుల ఫోన్లు, ఇతర ఆధారాలను కాల్చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఆ తర్వాత కుమావత్‌తో కలసి లలిత్ ఝా ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సాంకేతిక ఆధారాలను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసిన లలిత్ ఝా, మహేశ్ కుమావత్‌లపై మరికొన్ని సెక్షన్ల కింద ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. మరోవైపు.. పశ్చిమ బెంగాల్‌లోని లలిత్ ఝా స్నేహితుడు ఓ ఎన్జీవోకు చెందిన సౌరవ్ చక్రవర్తి మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో దాడి తర్వాత ఆ నిరసనను రికార్డు చేసి సౌరవ్‌కు పంపిన లలిత్ ఝా.. సోషల్ మీడియాలో వైరల్ చేయాలని సూచించాడు. ఈ క్రమంలోనే సౌరవ్ చక్రవర్తిని ఇప్పటికే పోలీసులు విచారణ చేశారు. ఈ ఏడాది మే 14 వ తేదీన ఫేస్‌బుక్‌లో లలిత్ ఝా తనకు పరిచయమయ్యాడని తెలిపారు. లలిత్ ఝా పార్లమెంట్‌లో ఆందోళనకు ప్లాన్ చేస్తున్నాడనే సంగతి తనకు తెలియదని.. స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో సోషల్ మీడియాలో తన పోస్టులను లైక్ చేసేవాడని పేర్కొన్నారు. కోల్‌కతాలో జరిగిన రెండు ర్యాలీల్లో తాము ఇద్దరం కలిశామని సౌరవ్ వెల్లడించారు.