ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఈ క్రమంలోనే భారత్‌లో కూడా రోజూ వారి కేసుల సంఖ్య పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా దేశంలో కొవిడ్ మహమ్మారి కారణంగా మరో ఐదుగురు బలి కావడం సంచలనంగా మారింది. మరోవైపు.. ఒక్కరోజే 335 కేసులు నమోదు కావడం.. యాక్టివ్ కేసుల సంఖ్య 2 వేలకు చేరువకావడం దేశంలో మరోసారి కొవిడ్ మహమ్మారి పడగ విప్పుతోంది అని చెప్పడానికి నిదర్శనంగా మారింది. దీనికితోడు చైనాలో కేసుల పెరుగుదలకు కారణమైన జేఎన్ 1 సబ్ వేరియంట్ కేసు కేరళలో వెలుగు చూడటం తీవ్ర కలకలం రేపుతోంది.
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 335 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కాటుకు మరో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. అయితే చనిపోయివారిలో నలుగురు కేరళకు చెందిన వారే ఉండటం గమనార్హం. మరొకరు ఉత్తర్‌ప్రదేశ్ వాసి ఉన్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1701 కి చేరింది. ఇక అమెరికాలో పుట్టిన జేఎన్ 1 అనే కొత్త కరోనా వేరియంట్ మన దేశంలో కూడా వెలుగుచూడటం తీవ్ర కలకలం రేపుతోంది. కేరళకు చెందిన 73 మహిళకు కరోనా సోకగా.. ఆ నమూనాలను ల్యాబ్‌కు పంపించి పరీక్షించగా.. ఆ మహిళకు జేఎన్ 1 వేరియంట్ సోకిందని గుర్తించారు. అయితే ఆమె చికిత్స పొందుతూనే మరణించింది. దీంతో జేఎన్ 1 వేరియంట్ కారణంగా దేశంలో తొలి మరణం సంభవించింది.
మరోవైపు.. ఇప్పటివరకు దేశంలో 4.50 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 4.46 కోట్ల మంది కోలుకున్నారని 5,33,316 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 98.81 శాతం ఉండగా.. మరణాల రేటు 1.19 శాతంగా ఉందని పేర్కొన్నాయి. ఇప్పటివరకు దేశంలో 220.67 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం ప్రకటించింది. దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.