టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అనుహ్య స్పందన వచ్చిందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం యువగళం పాదయాత్రకు అనేక ఇబ్బందులు పెట్టారన్నారు. యువగళం పాదయాత్రలో లోకేష్ ప్రజలతో మమేకం అయ్యారని తెలిపారు. 97 నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్ర జరిగిందని... అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. రేపు నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లిలో నవశకం పేరుతో భారీ బహిరంగ సభ జరగనుందని... సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, లోకేష్, పార్టీ సీనియర్ నేతలు హాజరవుతున్నారన్నారు.నవశకం సభ నుండే ఎన్నికల సంఖారావాన్ని పూరించబోతున్నామని తెలిపారు. 2024 జరిగే ఎన్నికల్లో టీడీపీ - జనసేన ప్రభుత్వం రాబోతుందని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి హమీలు అమలు చేయడంలో విఫలం అయ్యారన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హమీలపై తాము చర్చకు సిద్ధమన్నారు. ఎన్నికల ముందు విశాఖకు వస్తానని సీఎం హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు రెడీగా ఉన్నారన్నారు. టీడీపీ - జనసేన కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ అవుతుందని.. మళ్లీ చంద్రబాబే సీఎం అవుతారని గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు.