విజయవాడ దుర్గమ్మకు భారీగా ఆదాయం సమకూరింది. శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో లెక్కించారు. మొత్తం 27 రోజుల్లో రూ.4.24 కోట్ల ఆదాయం వచ్చింది. 670 గ్రాముల బంగారం, 8.150 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించుకున్నారు. ఈ-హుండీ ద్వారా రూ.1,31,417 కానుకలను భక్తులు సమర్పించారు. 865 యూఎస్ డాలర్లు, 75 ఇంగ్లాండ్ పౌండ్లు, 95 ఆస్ట్రేలియా డాలర్లు, 68 సింగపూర్ డాలర్లు, 7 కువైట్ దీనార్లు భక్తులు అమ్మవారికి సమర్పించారు. కానుకల లెక్కింపును దుర్గగుడి ట్రస్టుబోర్డు ఛైర్మన్ రాంబాబు, ఈవో రామారావు పర్యవేక్షించారు. ఆలయ సిబ్బంది, సేవా సిబ్బంది లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలి వస్తుంటారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. హుండీలో కూడా కానుకలు సమర్పిస్తుంటారు. భక్తులు హుండీల్లో బంగారం, వెండితో పాటుగా విదేశీ కరెన్సీను కూడా సమర్పిస్తారు.ఈ హుండీలో కూడా కానుకలు వస్తుంటాయి. వీటన్నింటిని కలిపి లెక్కిస్తారు.