విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా సరికొత్త ఈక్వేషన్‌ను తెరపైకి తీసుకొచ్చారు. నిఖార్సైన బీసీకి టీడీపీ ఎంపీ టికెట్ ఇస్తే తాను సహకరిస్తానని తేల్చి చెప్పారు. కాల్‌మనీ, సెక్స్ రాకెట్, గూండాగిరీ చేసేవాళ్లు బీసీలు కాదని.. ప్రజలను పీడించి అక్రమంగా వేల కోట్లు దోచుకున్న వారు బీసీలు కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారి కోసం తాను పనిచేయనని.. పార్టీ కోసం పనిచేసే వారే అసలైన బీసీలన్నారు. అలాంటి వారు విజయవాడలో చాలామంది ఉన్నారని.. వారి గెలుపు కోసం మాత్రమే తాను పనిచేస్తానన్నారు.
బీసీలంటే నీతి, నిజాయితీతో పనిచేసేవారని.. వీఎంసీలో ఐదేళ్లు డిప్యూటీ మేయర్‌గా పనిచేసిన బీసీ గోగుల రమణ నిజాయితీగా ఉండి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. నిరుపేదలైనా క్యారెక్టర్ ఉన్నవారైతే వారి కాళ్లకు దండం పెడతానన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తాయన్నారు. పొత్తులు అనేవి రాజకీయాల్లో కొత్త కాదని.. బీజేపీ కూడా అనేక పార్టీలతో పొత్తులు పెట్టుకునే అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజాస్వామ్యంలో పార్టీల మధ్య పొత్తు సహజమేనని.. భావసారూప్యం కలిగిన పార్టీలు కలవడం ద్వారా ప్రజలకు, రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు.
రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు సారథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి పనిచేస్తున్నామన్నారు. ఈ పొత్తును ప్రజలు స్వాగతిస్తు న్నారని.. ఓటమి భయంతోనే ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్నాయన్నారు. కేశినేని నాని పరోక్షంగా విజయవాడ ఎంపీ సీటును బీసీ అభ్యర్థికి ఇవ్వాలని ప్రస్తావించారు. అలాగే గోగుల రమణ పేరును తెరపైకి తెచ్చారు.. దీంతో విజయవాడ టీడీపీ రాజకీయం ఆసక్తికరంగా మారింది. కేశినేని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై కాస్త సందిగ్థంలో ఉన్నారు. ఒకటి, రెండు సందర్భాల్లో పోటీ చేయనని పరోక్షంగా చెప్పారు.
అయితే నాని తమ్ముడు చిన్ని విజయవాడ ఎంపీ సీటు నుంచి పోటీ చేయాలని ఆసక్తిగా ఉన్నారు. కానీ నాని, చిన్నిల మధ్య విభేదాలు ఉన్నాయి.. ఈ క్రమంలో చిన్నికి టికెట్ ఇస్తే.. నాని సహకరించడం కష్టమే అంటున్నారు. అందుకే కేశినేని సరికొత్త ఈక్వేషన్‌ను తెరపైకి తీసుకొచ్చారు.. బీసీకి టికెట్ ఇవ్వాలంటున్నారు. మరి అధిష్టానం నాని ప్రపోజల్‌పై ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీచేసే అంశంపైనా గందరగోళం కొనసాగుతోంది. విజయవాడ పశ్చిమం నియోజకవర్గంలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, బేగ్, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలు రేసులో ఉన్నారు. అలాగే జనసేన పార్టీ కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఈ సీటు ఎవరికి కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.