తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన సిల్వర్ కోటెడ్ రాగి రేకులు జనవరి 4న టెండర్ కమ్ వేలం (ఆఫ్‌లైన్) వేయనున్నారు. ఇందులో సిల్వర్ కోటెడ్ రాగి రేకులు (5,400 కేజిలు) -27 లాట్లు వేలానికి ఉంచారు. ఇతర వివరాలకు తిరుపతిలోని హరేరామ హరేకృష్ణ రోడ్డులో గల టీటీడీ మార్కెటింగ్ కార్యాలయం (వేలం) 0877-2264429, నంబర్లలో కార్యాలయం పని వేళల్లో, టీటీడీ వెబ్‌సైట్ www.tirumala.org సంప్రదించగలరు. శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి, 24న వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున 12.05 గంటల నుండి 2.30 గంట వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం ఏకాంతంగా నిర్వహిస్తారు. వేకువజామున 2.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 6 నుండి 7 గంటల వరకు బంగారు తిరుచ్చిపై స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు రాత్రి కైంకర్యాలు తిరిగి సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. అదేవిధంగా డిసెంబరు 24న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4 నుండి 5.30 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు, ఉదయం 5.30 నుండి 7.30 గంటల వరకు తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు చక్రస్నానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా డిసెంబరు 23, 24వ తేదీల్లో ఆర్జిత కల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆలయంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్విమ్స్ ఆధ్వర్యంలోని శ్రీ బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ప్రత్యేకాధికారి డా.ఎం.జయచంద్రారెడ్డికి ప్రతిష్టాత్మక “యంగ్ సర్జన్ ఆఫ్ ఇండియా” అవార్డు లభించింది. టీటీడీ వైద్యునికి అరుదైన గౌరవం లభించింది. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జేఈవో శ్రీమతి సదా భార్గవి డా.ఎం.జయచంద్రారెడ్డిని అభినందించారు.
విశాఖపట్నంలో జరిగిన అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా సదస్సులో డాక్టర్.మెట్టా.జయచంద్రారెడ్డికి “యంగ్ సర్జన్ ఆఫ్ ఇండియా” అవార్డు ప్రధానం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకొంటున్న మొదటి వ్యక్తి డా.జయచంద్రారెడ్డి. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాన్సర్ నిర్థారణ – నివారణ, కీమోథెరపీ డే కేర్ సెంటర్లకు గౌరవ సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి సంవత్సరం అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) ప్రధాన కార్యాలయంలోని సీనియర్ సర్జన్ల నిపుణుల కమిటీ దేశంలోని యువ (40 సంవత్సరాలలోపు) వారి నుండి ప్రతిష్టాత్మకమైన “యంగ్ సర్జన్ ఆఫ్ ఇండియా” అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. వివిధ రాష్ట్రాల నుండి అందిన దరఖాస్తులను పరిశీలించి “యంగ్ సర్జన్ ఆఫ్ ఇండియా” అవార్డు ఇవ్వడం జరుగుతుంది. 1938లో సంస్థ ఏర్పడినప్పటి నుండి మొదటిసారిగా విశాఖపట్నంలో తన వార్షిక జాతీయ మహాసభలను నిర్వహిస్తోంది.