పీరియడ్ నొప్పికి స్నేహితులు సలహాతో గర్బనిరోధక మాత్రలు వేసుకున్న ఓ పదహారేళ్ల బాలిక చివరకు ప్రాణాలను పోగొట్టుకుంది. గర్భనిరోధక మాత్రను తీసుకున్న మూడు వారాల తర్వాత బాలిక కడుపులో ఇన్‌ఫెక్షన్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అనంతరం 48 గంటల్లోనే మెదడులో రక్తం గట్టకట్టి బ్రెయిన్ డెడ్ అయ్యింది. అత్యంత విషాదకర ఈ ఘటన యూకేలో చోటుచేసుకుంది. ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. యూకేకు చెందిన లైలా ఖాన్ (16) విపరీతమైన పీరియడ్స్ నొప్పిని అనుభవించింది. గర్భనిరోధక మాత్రలు తీసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని స్నేహితులు ఆమెకు సలహా ఇచ్చారు.
వారి సూచనలతో నవంబర్ 25న టాబ్లెట్లు వేసుకుంది. కానీ, డిసెంబర్ 5 నాటికి ఆమెకు చిన్నగా తలనొప్పి ప్రారంభమై వారం తిరిగేసరికి వాంతులు మొదలయ్యాయి. ప్రతి 30 నిమిషాలకు వాంతులు కావడంతో లైలాను కుటుంబసభ్యులు క్లినిక్‌కు తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెకు ట్యాబ్లెట్ ఇచ్చి కడుపులో ఇన్‌ఫెక్షన్ ఉందని చెప్పారు. 111 నేషనల్ హెల్త్ సర్వీస్ హెల్ప్‌లైన్‌కి కాల్ చేసినప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తమకు సమాచారం అందిందని లైలా కుటుంబం పేర్కొంది. లైలా బంధువు జెన్నా బ్రైత్‌వైట్ మాట్లాడుతూ... ‘ఆదివారం రాత్రి ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది.. ప్రతి 30 నిమిషాలకు వాంతు అవుతోంది. కాబట్టి మేం సోమవారం ఉదయం జనరల్ ప్రాక్టీషినర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నాం.. అప్పటికే తీవ్ర అనారోగ్యంతో ఉంది.. పరీక్షించిన వైద్యులు ఆమెకు యాంటీ-సిక్‌నెస్ మాత్రలు ఇచ్చారు... కడుపులో ఇన్‌ఫెక్షన్‌గా భావించారు.. పరిస్థితి అంత తీవ్రమైంది కాదని, ఇలాగే ఉంటే బుధవారం ఆసుపత్రికి వెళ్లాలని చెప్పారు’ అని అన్నారు.
వైద్యుడు ఇచ్చిన ఔషదాలు వేసుకున్నా ఆమె పరిస్థితి విషమించింది. భరింపరాని నొప్పితో కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ, దురదృష్టవశాత్తూ బాత్రూంలో కుప్పకూలిపోయింది. దీంతో బ్రైత్‌వైట్, లైలా తల్లి కలిసి బాలికను కారును అతికష్టంతో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో సీటీ స్కాన్ చేసిన తర్వాత మెదడులో రక్తం గడ్డకట్టినట్టు గుర్తించారు. డిసెంబర్ 13న లైలాకు శస్త్రచికిత్స జరిగింది, అయితే మర్నాడు ఆమె బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ‘క్రిస్మస్‌కు ముందు జరిగిన ఈ విషాదంతో మా కుటుంబం బాధ, ఆవేదను మాటల్లో చెప్పలేం.. పరిస్థితి అంత తీవ్రంగా లేదని వారు ఎందుకు చెప్పారో మాకు అర్థం కాలేదు. ఆ రోజు తర్వాత ఆమె బ్రెయిన్ డెడ్ అయింది. ఇది అర్థం చేసుకోలేనిది. ఇది చాలా షాక్. ఆమె ఇప్పుడే కాలేజీలో చేరి ఉద్యోగం కూడా సంపాదించింది. మా కుటుంబానికి పూడ్చలేని లోటు ఇది’ అని బ్రెత్‌వైట్ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రొఫెసర్లు ఆమెను ఆక్స్‌ఫర్డ్ విద్యార్థినిగా పరిగణించారని లైలా కుటుంబం పేర్కొంది. పుట్టేడు దుఃఖాన్ని దిగమింగుకున్న ఆ కుటుంబం.. లైలా అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చింది. క్రిస్మస్‌కు ముందు లైలా అవయవాలు ఐదుగురు జీవితాల్లో కొత్త వెలుగులు నింపాయి. తాను చనిపోతూ ఐదుగురికి జీవితాన్నిచ్చింది.