కరోనా మహమ్మారి అంతం అయిపోయింది అనుకున్న తరుణంలో ఒక్కో కొత్త వేరియంట్ వెలుగు చూస్తోంది. అయితే ప్రస్తుతం జేఎన్ 1 కొవిడ్ వేరియంట్ రూపంలో ప్రపంచ దేశాలకు మరోసారి కరోనా మహమ్మారి సవాల్ విసురుతోంది. తొలిసారి అమెరికాలో ఈ జేఎన్ 1 వేరియంట్‌ను గుర్తించగా.. అది ప్రస్తుతం చైనాలో కేసుల పెరుగుదలకు కారణం అవుతోంది. అయితే క్రమంగా ఈ జేఎన్ 1 వేరియంట్.. వివిధ దేశాలకు కూడా విస్తరించింది. ఆ జాబితాలో భారత్ కూడా ఉండటం ప్రస్తుతం దేశప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే దేశంలో క్రమంగా పెరుగుతున్న కొవిడ్ కేసులు.. ఈ వేరియంట్ కారణంగానేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొవిడ్ కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1.. దేశంలో క్రమంగా విస్తరిస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. ఇప్పటివరకు 3 రాష్ట్రాల్లో 21 కేసులు గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలోని ఇండియన్ సార్స్ కోవ్ 2 జీనోమిక్స్ కన్సార్టియం-ఇన్సాకాగ్ వెల్లడించింది. జేఎన్ 1 వ్యాప్తిపై ఇప్పటికే అన్ని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది. అదే సమయంలో జేఎన్ 1 కు సంబంధించి 3 రాష్ట్రాల్లో ఇప్పటివరకు 21 కేసులు గుర్తించినట్లు ఇన్సాకాగ్ వెల్లడించింది. గోవాలో అత్యధికంగా 19, కేరళ, మహారాష్ట్రలో ఒక్కొక్కటి చొప్పున ఈ జేఎన్ 1 రకం కొవిడ్ కేసులు నమోదైనట్లు తెలిపింది.
మరోవైపు.. కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక్కరోజే 614 కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. ఈ ఏడాది మే 21 వ తేదీ తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అని తెలిపింది. దీంతో ప్రస్తుతం దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 2311కు చేరినట్లు వెల్లడించింది. ఈ క్రమంలోనే కొవిడ్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఇవాళ హై లెవల్ మీటింగ్ నిర్వహించారు. జేఎన్ 1 కరోనా వేరియంట్ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అయితే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కొత్త కొవిడ్ సబ్‌వేరియంట్ జేఎన్ 1 రకం ఇప్పటికే పలు దేశాల్లో బయట పడినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. అమెరికా, చైనా, సింగపూర్‌తోపాటు భారత్‌లోనూ ఈ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ఆ జేఎన్ 1 వేరియంట్‌ను ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా డబ్ల్యూహెచ్‌వో అభివర్ణించింది. అయితే ఈ జేఎన్ 1 వేరియంట్ ప్రజల ఆరోగ్యంపై అంతగా ప్రభావం చూపదని స్పష్టం చేసింది. మరోవైపు గత వారం రోజుల్లోనే సింగపూర్‌లో 56 వేల కొత్త కొవిడ్ కేసులు నమోదు కావడం ప్రపంచ దేశాలను తీవ్రంగా భయపెడుతోంది.