దేశంలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. అన్ని రాష్ట్రాలతో కొవిడ్ సమీక్షా సమావేశం నిర్వహించింది. కరోనా వైరస్ వ్యాప్తి, దాని నియంత్రణ, కొవిడ్ విజృంభిస్తే ప్రజలను కాపాడేందుకు ఆస్పత్రుల సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ.. బుధవారం రాష్ట్రాల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు మన్‌సుఖ్ మాండవీయ.. కీలక సూచనలు చేశారు. ప్రతీ 3 నెలలకు ఒకసారి అన్ని ఆస్పత్రుల్లో కొవిడ్ మాక్‌డ్రిల్ నిర్వహించాలని సూచించారు. జేన్ 1 సబ్‌వేరియంట్ వ్యాప్తిపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని.. అయితే దీని పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
దేశంలో వైరస్ వ్యాప్తి పట్ల అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఈ ఉన్నత స్థాయి సమావేశంలో సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన కీలక సూచనలు చేశారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న కేసులతో మళ్లీ కొవిడ్ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. కానీ అదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని.. ఆస్పత్రుల సన్నద్ధత, వైరస్ వ్యాప్తిని నిరోధించడం, ప్రజలకు అవగాహన కల్పించడంపై సిద్ధంగా ఉండాలని తెలిపారు.
ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను రాజకీయం చేయొద్దని మన్‌సుఖ్ మాండవీయ కోరారు. కరోనా వైరస్ కట్టడికి రాష్ట్రాలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. పండగల సీజన్‌తో పాటు చలి కాలం నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల నియంత్రణ చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం విజ్ఞప్తి చేసింది. గత కొన్ని రోజుల నుంచి దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. కేసుల పెరుగుదలకు కొత్త కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్ 1 కారణం అని గుర్తించారు. ఈ క్రమంలోనే వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు మార్గదర్శకాలు పాటించాలని.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖలు రాసింది. రాష్ట్రాల్లో కొవిడ్ పరీక్షలను పెంచాలని అధికారులకు సూచించింది. మరోవైపు.. కరోనా కొత్త వేరియంట్ జేన్ 1 గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తాజాగా వెల్లడించింది. ఇది ప్రజల ఆరోగ్యంపై అంత పెద్దగా ప్రభావం చూపించదని పేర్కొంది. ఈ వేరియంట్‌ను ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా పేర్కొన్న డబ్ల్యూహెచ్ఓ ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు జేఎన్.1తోపాటు ఇతర వేరియంట్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని స్పష్టం చేసింది.