దేశంలో చాప కింద నీరు లాగా కొవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందుతోంది. దీంతో మళ్లీ ప్రజల్లో కొత్త భయాలు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లోనే కొత్తగా 341 కరోనా కేసులు వెలుగు చూశాయి. కరోనా వైరస్ ధాటికి మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఇందులో ఒక్క కేరళలోనే 292 కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చనిపోయిన ముగ్గురు కూడా కేరళకు చెందిన వారే కావడం గమనార్హం. కేరళలో వెలుగు చూసిన జేఎన్ 1 కొత్త వేరియంట్ కారణంగానే కేసులు పెరుగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో జేఎన్ 1 కొత్త వేరియంట్ వెలుగు చూడటంతో అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో మొత్తం 341 కొత్త కరోనా కేసులు నమోదు కాగా వైరస్ ధాటి మరో ముగ్గురు బలయ్యారు. ఆ ముగ్గురు కూడా కేరళ వారే. ఈ కొత్త కేసులతో కలిపి ప్రస్తుతం దేశంలో 2311 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే ఈ కరోనా యాక్టివ్ కేసుల్లో ఒక్క కేరళ రాష్ట్రం నుంచే 2041 కేసులు ఉన్నాయి. కేరళ తర్వాత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి.
ప్రస్తుతం దేశంలో జేఎన్ 1 కొత్త కొవిడ్ వేరియంట్ వెలుగు చూసిన నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ కొత్త వేరియంట్ ప్రమాదకరం కాదని ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌తోపాటు నిపుణులు కూడా చెబుతుండటం కొంత ఊరట కల్పిస్తోంది. ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ.. అన్ని రాష్ట్రాల ఉన్నతాధికారులతో కలిసి కేసులు పెరుగుతుండడంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్ష అనంతరం ఆరోగ్య శాఖ అధికారులు కొత్త వేరియెంట్ వ్యాప్తిపై మరిన్ని విషయాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. దేశంలో కొత్త కొవిడ్ వేరియంట్ వెలుగు చూడటంతో రాష్ట్రాలు కూడా అప్రమత్తం అయ్యాయి. కర్ణాటకలో 60 ఏళ్లు దాటిన వారు, దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు ఉన్న వారు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక అన్ని రాష్ట్రాలు కూడా కొవిడ్ వైరస్ వస్తే తట్టుకునేలా ఆస్పత్రులు, మందులు, ఇతర మెడికల్ సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు కూడా కొవిడ్ నియమాలు పాటించాలని కేంద్రం సూచించింది.