ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని తెలిసి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దళితులపై కేసులు ఎత్తివేశామంటూ నాటకాలు ఆడుతున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్కు దళితులపై ప్రేమ ఉంటే దళితుడిని హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును ఎందుకు ప్రక్కన పెట్టుకున్నారని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్ళ వైసీపీ పాలనలో దళితులపై 12 వేల దాడులు జరిగితే ఎందుకు నోరు మెదపలేదన్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజక వర్గంలో హత్యాచారానికి గురైన దళిత మహిళ నాగమ్మకు ఎందుకు న్యాయం చేయలేదని నిలదీశారు. దళితుడైన కొడికత్తి శ్రీనుకు బెయిల్ రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారన్నారు. జగన్ కల్లబొల్లి కబుర్లను, కపట ప్రేమను దళితులు నమ్మే రోజులు పోయాయని, వైసీపీని ఓడించేందుకు దళితులు సిద్ధంగా ఉన్నారని దేవతోటి నాగరాజు అన్నారు.