ఏపీలో వందేభారత్ మధ్యలోనే ఆగిపోయింది. సికింద్రాబాద్ నుంచి విశాఖ బయల్దేరిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇంజన్‌లో సాంకేతిక లోపంతో పశివేదల-కొవ్వూరు మధ్యన శుక్రవారం రాత్రి నిలిచిపోయింది. ఏం జరిగిందో అర్థంకాక, ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. రాజమహేంద్రవరం నుంచి రైల్వే టెక్నికల్ సిబ్బంది అక్కడకు చేరుకుని ఇంజిన్‌లో సమస్య కారణంగా రైలు నిలిచిపోయినట్లు గుర్తించారు. వెంటనే సిబ్బంది హాజరైనా ఫలితం లేకపోవడంతో రాజమహేంద్రవరం నుంచి సాధారణ రైళ్లకు ఉపయోగించే రెండు ఎలక్ట్రిక్ ఇంజన్లను కొవ్వూరు పంపించారు.
ఆ ఇంజన్లను వందే భారత్ రైలుకు అమర్చి రాజమహేంద్రవరానికి గంటకు 130 కి.మీ నుంచి 180 కి.మీ స్పీడ్‌తో వెళ్లే రైలును 20 కి.మీ స్పీడ్‌తో రాజమహేంద్ర వరం తీసుకొచ్చారు. లోకో ఇంజిన్ల సహాయంతో రాత్రి 11.23 గంటల సమయంలో వందేభారత్ రైలు అక్కడి నుంచి కదిలి 11.44 గంటలకు రాజమహేంద్రవరం చేరుకోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.అయితే ఇక్కడ కూడా సాంకేతిక సిబ్బంది హాజరైనప్పటికీ ఉపయోగం లేకపోవడంతో అదే ఇంజన్లతో 12 గంటలకు వందే భారత్ బయలుదేరింది. అయితే వందేభారత్ రైలు నెమ్మదిగా వెళ్లడంతో వెనుక వచ్చే రైళ్లన్నీ కూడా ఆలస్యంగా నడిచాయి. మెయిన్ లైన్‌లో వందేభారత్ నిలిచిపోవడంతో వెనుక వచ్చే మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లను చాగల్లు, నిడదవోలు రైల్వేస్టేషన్ల వద్ద నిలిపివేశారు. వందే భారత్ ఒకవేళ రాజమహేంద్రవరం నిలిపివేయాల్సి వస్తే ప్రయాణికులను వేరే రైళ్లలో తరలించాలనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 12మంది టిక్కెట్ చెకింగ్ సిబ్బంది చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ చంద్రమౌళి ఆధ్వర్యంలో వందేభారత్ దగ్గరకు చేరుకున్నారు. కానీ వందే భారత్ బయలుదేరడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. ఆర్‌పీఎఫ్ సిబ్బంది కూడా అప్రమత్తమై రైళ్ల దగ్గరకు వెళ్లారు.