అంగన్‌వాడీల సమ్మె రోజు రోజుకు ఉధృతం అవుతుండడంతో జగన్ ప్రభుత్వం అంగన్‌వాడీ సంఘాలను ప్రభుత్వం చర్చలకు పిలిచింది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో అంగన్‌వాడీ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చించనుంది. వేతనాల పెంపుపై అంగన్‌వాడీలు పట్టుపడుతుంటే.. వేతనాలు పెంపు మినహా మిగతా అంశాలపై చర్చిద్దామని ప్రభుత్వం చెబుతోంది. ఏఐటీయూసీతోపాటు మరో రెండు సంఘాల ప్రతినిధులు చర్చలకు రావాలసిందిగా ఆహ్వానం పంపింది. దాదాపు 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలు.. తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ పాదయాత్ర చేసిన సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే.. తెలంగాణలో కంటే రూ. వెయ్యి ఎక్కువ పెంచుతానని హామి ఇచ్చారని, ప్రస్తుతం ఆ హామీని అమలు చేయాలని అంగన్‌వాడీలు డిమాండ్ చేస్తున్నారు. మిగతా అన్ని డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి.. పరిశీలిస్తామని చెప్పినప్పటికీ .. గతంలో రెండు పర్యాయాల చర్చలు జరిగినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదు. ఈ రోజైన తమ ఢిమాండ్లు పరిష్కరించాలని, వాటికి లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరారు. వేతనం పెంపు తక్షణం అమలులోకి రావాలని అన్నారు. ఈరోజు ఆకలి కేకలు పేరుతో అన్ని శిబిరాల్లో అంగన్‌వాడీలు పల్లెలు, గరిటలు మోగించాలని నిర్ణయించారు.