టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను ఉన్నాను, నేను విన్నాను’ అని చెప్పి ఎన్నికలో గెలిచిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను సీఎం మోసం చేశారని, ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ‘ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం’ పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నాలుగున్నరేళ్ళగా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో సీఎం జగన్ ఆటలు ఆడుకుంటున్నారని, ఆశావర్కర్స్, మున్సిపాలిటీ, అంగన్వాడీ ఉద్యోగులు.. ఇలా అందరితో ముఖ్యమంత్రి అడుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వకుండా.. మధ్యతరగతి ప్రజల జీవితాలతో ఆడుకున్నారని అనిత అన్నారు. క్యాసినో కొడాలి నాని, బెట్టింగ్ అనిల్ కుమార్ వైసీపీలో ఉన్నారని, పేకాట ఆడే వైసీపీ నాయకులను జగన్ తయారు చేశారని మండిపడ్డారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో రూ. 100 కోట్లు ఖర్చు పెడుతున్నారని... ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేస్తున్నారని, ఆడుదాం ఆంధ్రా కాకుండా దోచుకొండ్రా ఆంధ్ర అనే పెడితే సీఎంకు, వైసీపీ పార్టీకి సరిపోతుందన్నారు. డబ్బులను దోచుకోవడానికే అడుదాం ఆంధ్ర ప్రోగ్రాం చేస్తున్నారని విమర్శించారు. జగన్ ఎన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఆడుకోవాలో అన్ని రకాలుగా ఆడుకుంటున్నారని.. ఇప్పుడు ప్రజలు జగన్, వైసీపీతో ఆడుకునే సమయం వచ్చిందని.. ఇక సీఎం జగన్ ఆటలు చెల్లవని వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు.