ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో ఏపీ కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు సమావేశం కొనసాగింది. సమావేశానికి ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, పల్లం రాజు, రఘువీరా రెడ్డి, చింతా మోహన్ హాజరయ్యారు. రానున్న లోక్‌సభ ఎన్నికలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. సమావేశం అనంతరం ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ.. ఏపీలో కాంగ్రెస్‌ను పునర్నిర్మిస్తామన్నారు. కాంగ్రెస్ సిద్దాంతం నమ్మే వారికి స్వాగతమన్నారు. ఏపీలో 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని తెలిపారు. మోడీ వివక్షాపూరిత వైఖరి కారణంగా ఏపీ నష్టపోయిందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను మోడీ ప్రభుత్వం అమలు పరచలేదన్నారు. కాంగ్రెస్ కుటుంబానికి తిరిగి రావాలని ఆహ్వానిస్తున్నామన్నారు. షర్మిల చేరికపై ఖర్గే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కాంగ్రెస్‌తో కలిసొచ్చే పార్టీలను ఆహ్వానిస్తున్నామని.. సీట్ల సర్దుబాటు గురించి ఎటువంటి చర్చ జరగలేదని మాణిక్యం ఠాగూర్ వెల్లడించారు.ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్ర రాజు మాట్లాడుతూ.. రాబోయే ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో ఓటు శాతం పెంచుకునేందుకు కృషి చేస్తామన్నారు. వచ్చే వంద రోజుల యాక్షన్ ప్లాన్‌పై చర్చ జరిపామన్నారు. పార్టీలోకి తిరిగి వచ్చే వారికి ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు.