రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్చార్జుల మార్పుపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది. బుధవారం మరికొందరి మంత్రులు, ప్రజా ప్రతినిధులకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. దీంతో విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధనరెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబురావు, ఎంపీ ఆదాల ప్రభాకర రెడ్డి, పెనుగొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర నారాయణ, కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి, శ్రీకాకుళం జిల్లా రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు తదితరులు క్యాంపు కార్యాలయానికి వచ్చారు.ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశమై సీట్ల మార్పులపై సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి చర్చిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల మార్పులపై ముందుగా వారు చర్చలు జరుపుతున్నారు. నేతల అభిప్రాయాలు తెలుసుకుని పలు నియోజకవర్గ ఇన్చార్జులను సీఎం జగన్ ఖరారు చేయనున్నారు. కసరత్తు అనంతరం రెండు రోజుల్లో మార్చిన ఇన్చార్జులతో రెండో జాబితాను వైసీపీ అధిష్టానం విడుదల చేసే అవకాశముంది. మరోవైపు అభ్యర్థులను మార్చిన సెగ్మెంట్లలో సమన్వయం కోసం వైసీపీ కసరత్తు చేస్తోంది. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి ముందుకు ప్రకాశం జిల్లా నేతలు మంత్రి మేరుగ, బాలినేని, మాగుంట, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివ, సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు, కొండెపి నియోజకవర్గ నేతలు హాజరయ్యారు. ప్రకాశం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో హైకమాండ్ మార్పులు చేసింది. కొండేపి నియోజకవర్గ ఇన్చార్జ్ అశోక్ బాబు స్థానంలో మంత్రి సురేష్‌కు బాధ్యతలు అప్పగించింది. సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబుకు అవకాశం ఇవ్వలేదు. ఈ మార్పులపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ తగాదాలు పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని విజయసాయి రెడ్డి నేతలకు సూచనలు చేశారు.