ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ యువనేత నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలపై సైకో సర్కారు అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా సంగం మండలం తరుణవాయిలో తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆత్మకూరులో ఆందోళన కార్యక్రమానికి వెళ్తున్న వనమ్మ దారిలోనే అశువులు బాయడం తనను తీవ్రంగా కలచివేసిందని లోకేష్ అన్నారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో వ్యవహరించడం వల్లే అంగన్వాడీ వర్కర్ వనమ్మ బలైంది.ప్రభుత్వ అలసత్వం, జగన్ నియంత పాలన అంగన్ వాడీలకు శాపంగా మారింది. ఇప్పటికైనా దున్నపోతు ప్రభుత్వం మొద్దునిద్ర వీడి మానవతా దృక్పథంతో అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని లోకేష్ డిమాండ్ చేశారు.