రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మించిన ‘వ్యూహం’ సినిమాపై గురువారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ సినిమా ఈనెల 29న విడుదల కావాల్సి ఉంది. దీనిపై న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని, ఏపీలో జరగబోయే ఎన్నికల మీద తీవ్ర ప్రభావం పడుతుందని పిటిషనర్ తరుపున న్యాయవాది ఉన్నం మురళీధర్ గత విచారణలో వాదనలు వినిపించారు. అయితే దీనిపై స్టే ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. గురువారం నిర్మాత, డైరెక్టర్ తరుపున న్యాయస్థానం వాదనలు వినునుంది. వాదనలు తరువాత సినిమా విడుదలపై హైకోర్టు నిర్ణయం ప్రకటించనుంది. కాగా శుక్రవారం ‘వ్యూహం’ సినిమా విడుదల చేయడానికి చిత్రం యూనిట్ సిద్ధమైంది.