జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు జరగనున్న భవానీ దీక్షల విరమణలకు విస్త్రృత ఏర్పాట్లు చేస్తున్నట్టు దుర్గగుడి ట్రస్ట్‌బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. బుధవారం బ్రాహ్మణవీధిలోని జమ్మిదొడ్డిలోని సమావేశపు హాలులో పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించి, తీర్మానాలు చేశారు. దసరా మహోత్సవాలకు సంబంధించి, రానున్న భవానీదీక్షల ఏర్పాట్ల గురించి పలు అంశాలను చర్చించి ఆమోదించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భవానీ దీక్షల విరమణకు ఐదు నుంచి ఆరు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఆ మేరకు విస్త్రృత ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. దీక్షల విరమణకు 300 మంది గురుభవానీలను, ఇరుముడులను సమర్పించేందుకు ఇప్పటికే మూడు హోమగుండాలను సిద్ధం చేసినట్టు, అత్యవసరమైతే మరొక హోమగుండం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. భక్తులకు 20 లక్షల లడ్డూలు సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కేశఖండన శాలలు, స్నానాల కోసం 800 షవర్లు సిద్ధం చేస్తున్నామన్నారు. ఉచిత అన్నప్రసాదం అందజేయనున్నట్టు తెలిపారు. భక్తులకు ఏదో ఒక ప్రసాదం నిరంతరం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భవానీ భక్తులు కరోనా జాగ్రత్తలు తీసుకుని రావాలని సూచించారు. భవానీ దీక్షల విరమణలకు 3 కోట్ల రూపాయలతో ఏర్పాట్టు చేస్తున్నట్టు తెలిపారు. ప్రసాదాల తయారీకి నాణ్యమైన నెయ్యి సరఫరాకు టెండర్లు పిలిచినట్టు తెలిపారు. సరుకుల నాణ్యతకు ఎక్కువ మంది టెండరు దారులు పాల్గొనేందుకు వీలుగా పత్రికా ప్రకటనలు ఇవ్వనున్నట్టు చెప్పారు. దసరా ఉత్సవాలలో చేసిన పనులకు ఆమోదం తెలిపామన్నారు. సమావేశంలో ఈవో కేఎస్ రామారావు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు, ఈఈలు కోటేశ్వరరావు, రమాదేవి, ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.