జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో రెండో రోజు పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ అమలాపురం పార్లమెంట్ కు చెందిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కో- ఆర్డినేటర్లతో ఆయన మాట్లాడనున్నారు.కాకినాడ సిటీ నుంచి పోటీ చేయాలని పవన్ ను పలువురు నేతలు కోరుతున్నారు. పార్టీలో చర్చించి అవకాశాలను బట్టి పరిశీలిద్దామని జనసేనాని చీఫ్ చెప్పారు. గతంలో వారాహి యాత్ర సందర్భంగా జరిగిన సవాళ్ళలలో దమ్ముంటే తనపై పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ కి ద్వారంపూడి చంద్రశేఖర్ సవాలు చేశారు.. ఆ సవాల్ ను స్వీకరించి పోటీ చేస్తే పార్టీకి మైలేజ్ కూడా ఉంటుందని పవన్ దగ్గర పలువురు నేతలు ప్రస్తావించారు.ఇక, కాకినాడ సిటీ నియోజకవర్గంలో 50 డివిజన్లలో పార్టీ పరిస్థితి ఏంటి.. బూత్ స్థాయిలో అన్ని కమిటీలు ఉన్నాయా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై క్లారిటీ రాలేదు.. పొత్తులో భాగంగా కాకినాడ పార్లమెంట్ నుంచి జనసేన పోటీ చేయనుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆ ప్రభావం కచ్చితంగా పార్లమెంటుపై కూడా ఉంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో సంస్థగతంగా పార్టీని బలోపేతం చేసేలా పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి టీడీపీ- జనసేన కూటమి అధికారంలోకి తీసుకు రావాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య జనసేన నేతలతో వరుసగా పవన్ భేటీ అవుతున్నారు. పార్టీని ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా సన్నాహాలు చేస్తున్నారు.