ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా.. 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి నిధుల్ని బటన్ నొక్కి ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేశారు. అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్లు జమ చేశారు. ఈ మొత్తంతో కలిపి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.18,576 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తం గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఖర్చు చేసిన మొత్తం కంటే రూ.6,435 కోట్లు అధికం.
పేదల తలరాతలు మార్చే ఆస్తి చదువు అన్నారు ముఖ్యమంత్రి జగన్. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం చేస్తున్నామని.. ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తున్నామన్నారు. పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు జమ చేస్తున్నామని.. ఈ నాలుగున్నరేళ్లలో విప్లవాత్మకమైన అడుగులు వేశాంమన్నారు. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ బడుల రుపురేఖల్ని మార్చామని.. తరగతి గదులను డిజిటల్ క్లాస్‌రూమ్‌లుగా మార్చామన్నారు. ఎంతో విలువైన బైజూస్ కంటెంట్ అందించామన్నారు. స్కూళ్లల్లో సబ్జెక్ట్ టీచర్లను తీసుకొచ్చామన్నారు.
విద్యార్థుల భవిష్యత్ బాగుండాలన్నదే ప్రభుత్వ తాపత్రయమన్నారు సీఎం. విద్యా విధానంలో సంస్కరణలు తీసుకొచ్చామని.. బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి తెచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తున్నామని.. పిల్లలు గొప్పగా చదవాలని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. జగనన్న విదేశీ విద్యాదీవెన కింద 400 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందని.. ప్రపంచంలోని ప్రఖ్యాత యూనివర్శిటీల్లో మన విద్యార్థులు చదువుతున్నారన్నారు.
ప్రజలకు మంచి చేయాలని చంద్రబాబు ఏనాడు ఆలోచించలేదన్నారు ముఖ్యమంత్రి జగన్. దోచుకోవడం.. పంచుకోవడం మాత్రమే చంద్రబాబుకు తెలుసన్నారు. అధికారం కోసం ప్రజలకు అబద్ధాలు, మోసాలు చెప్పడమే వారి రాజకీయమన్నారు. దత్తపుత్రుడిని భీమవరంలో ప్రజలు తిరస్కరించారని.. దత్త పుత్రుడి నివాసం పక్క రాష్ట్రంలో ఉంటుందన్నారు. పక్కవాళ్లు సీఎం కావాలని పార్టీ పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ తప్ప ఎవరూ లేరన్నారు. చంద్రబాబు కోసమే పవన్ జీవితమని.. దత్తపుత్రుడు ఓ త్యాగాల తాగ్యరాజంటూ ఎద్దేవా చేశారు.
ప్యాకేజీల కోసం త్యాగాలు చేసేవాళ్లను ఇప్పటి వరకు చూసుండమని.. ప్యాకేజ్ స్టార్ ఆడవాళ్లను ఆట వస్తువులుగానే చూస్తారన్నారు. నాలుగేళ్లకోసారి భార్యలను మార్చిన ఈ మ్యారేజ్‌స్టార్.. ఇలాంటి వాళ్లను ఆదర్శంగా తీసుకుంటే ఆడబిడ్డల పరిస్థితి ఏంటన్నారు. వివాహ బంధాన్ని గౌరవించడు కానీ.. బాబుతో బంధం మాత్రం 15 ఏళ్లు ఉండాలట.. ఇలాంటి వాళ్లకి ఓటు వేయడం ధర్మమేనా? అన్నారు. ఆరు గ్యారెంటీలు అని చంద్రబాబు అన్నారని.. ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో అంటున్నారని ఎద్దేవా చేశారు. మోసాలతో మేనిఫెస్టో అంటూ మరోసారి ప్రజల ముందుకు వస్తారన్నారు.. ఏం చేశారని వాళ్లకు ఓట్లు వేయాలన్నారు. అమ్మఒడి వంటి గొప్ప పథకాన్ని ఏదైనా అమలు చేసి ఓట్లు అడగాలన్నారు.