పారిశుద్ధ్య కార్మికులు దయచేసి విధులకు హాజరుకావాలని కోరుతున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... మున్సిపల్ కార్మికుల సమ్మెతో ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామన్నారు. చెత్త తొలగింపు, మంచినీటి సరఫరా, కరెంట్ విషయంలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నామన్నారు. 3 వేలకు పైగా అదనపు సిబ్బందితో పాటు వాహనాలను కూడా తాత్కాలిక ప్రాతిపదికన తీసుకున్నామన్నారు. 123 మున్సిపాల్టీల్లో 41 మున్పిపాల్టీల్లో సమ్మె ప్రభావం లేదన్నారు. మిగిలిన వాటిలో పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే సమ్మెలో ఉన్నారని తెలిపారు. కార్మికుల డిమాండ్లపై ఇప్పటికే రెండుసార్లు చర్చలు జరిపామన్నారు. జీతభత్యాలు, ఉద్యోగ భద్రతపై ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారన్నారు. పీహెచ్ వర్కర్లకు రూ.12 వేలు ఉన్న జీతం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 21వేలకు పెంచామన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఇంత పెద్ద ఎత్తున జీతాలు ఎక్కడా లేవన్నారు. కార్మికులకు సంబంధించిన కొన్ని డిమాండ్ల పరిష్కారంపై ఇప్పటికే చర్యలు ప్రారంభించామన్నారు. మినిమం టైం స్కేలు అమలు అంశం సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా విధుల్లోకి చేరాలని కోరారు. రాజకీయ కోణంలో భాగంగానే కార్మికుల వాహనాలను ఆపుతున్నారని, టైర్లులో గాలి తీయడం చేస్తున్నారన్నారు.ఇలా చేసిన వారి చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. క్లాప్ వెహికిల్స్ కాంట్రాక్ట్ పద్దతిన తెచ్చామన్నారు. చెత్తను ఇంటివద్ద నుండి సేకరించి డంపింగ్ వరకూ చేరవేయడానికి తీసుకువచ్చామన్నారు. వారికి కాంట్రాక్టు కింద మూడు ప్రాంతాల్లో తీసుకున్నామని.. వారి పరిధిలోకి ఈ డ్రైవర్లు వస్తారని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.