బిహార్‌లో శుక్రవారం ఒక చిత్రమైన ఘటన జరిగింది. మోతీహరి పట్టణంలో ఉన్న ఓ ఫ్లై ఓవర్ కింద విమానం ఇరుక్కుపోయింది. దీంతో అది ముందుకు వెళ్లలేక వెనక్కి రాలేక అక్కడే చిక్కుకుపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో మోతీహరి ప్రజలు సరికొత్త అనుభూతిని ఎదుర్కొన్నారు. అయితే ఆ విమానం గాల్లో ఎగిరే విమానం కాదు. సర్వీస్ అయిపోయి మూలకు పడేసిన విమానం. దాన్ని ఒకచోటు నుంచి మరోచోటుకు తరలిస్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రక్కు మీద ఆ విమానాన్ని తీసుకెళ్తుండగా.. ఆ ట్రక్కు డ్రైవర్ చేసిన పొరపాటు వల్ల బ్రిడ్జి కింద ఆ విమానం చిక్కుకుపోయింది. దీంతో అక్కడ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన వారు తమ సెల్‌ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.
ఎయిరిండియాకు చెందిన ఓ పాత విమానం సర్వీస్ పూర్తయింది. కాలపరిమితి ముగిసిపోవడంతో పాడైపోయింది. ఎయిరిండియాకు చెందిన ఏ320 అనే భారీ విమానాన్ని ముంబై నుంచి అసోంకు ఓ ట్రక్కుపై తరలించేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మోతీహరి పట్టణంలోని పిప్రాకోటి ప్రాంతానికి చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న ఓవర్ బ్రిడ్జి దాటేందుకు ట్రక్కు ప్రయత్నించింది. అయితే ట్రక్కు డ్రైవర్ చేసిన పొరపాటు వల్ల ఆ విమానం ఆ బ్రిడ్జి కింద సగం దూరం వెళ్లిన తర్వాత చిక్కుకుపోయింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే విమానం చిక్కుకుపోయిందని అధికారులు తెలిపారు.
అయితే ఇటీవలె ఇలాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో కూడా జరిగింది. కొచ్చిన్ నుంచి ఓ భారీ ట్రక్కుపై ఓ పాత విమానాన్ని హైదరాబాద్ తరలిస్తుండగా బాపట్ల జిల్లాలోని ఓ అండర్ పాస్ వద్ద ఇరుక్కుపోయింది. హైదరాబాద్‌కు చెందిన ‘పిస్తా హౌస్’ అనే రెస్టారెంట్ కొనుగోలు చేసిన ఈ విమానం తీసుకువస్తుండగా అండర్ పాస్ వద్ద చిక్కుకుపోయింది. పాత విమానాన్ని హోటల్‌గా మార్చాలన్న ఉద్దేశంతో పిస్తా హౌస్ ఈ విమానాన్ని కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే ఆ విమానాన్ని హైదరాబాద్ తీసుకువస్తుండగా బాపట్లలోని మేదరమెట్ల బైపాస్ వద్ద ఉన్న అండర్ పాస్ వద్ద విమానాన్ని తరలిస్తున్న ట్రాలీ ఇరుక్కుపోయింది. దీంతో ఆ విమానానికి ఎలాంటి డ్యామేజ్ కాకుండా అతి కష్టం మీద అండర్ పాస్ నుంచి బయటకు తీసుకువచ్చారు.