వైసీపి చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా నర్సీపట్నం మెయిన్ రోడ్డులో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ, నర్సీపట్నం నియోజకవర్గం అభివృద్ధి జరగలన్నా, జగన్ అన్న సంక్షేమం కొనసాగాలంటే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు దశాబ్ధాల కాలంలో చేయలేని అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేశ్ నాలుగున్నరేళ్ల కాలంలో చేయడం గర్వకారణమని వివరించారు. చంద్రబాబు తరహాలో ఏరు దాటాక తెప్ప తగలేయకుండా, ఇచ్చిన హామీల మేరకు కట్టుబడి పట్టుదలతో సీఎం జగన్ రైతు, మహిళ, కార్మికులకు, విద్యార్థులకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. నాడు - నేడు ద్వారా కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా రూపుదిద్దారని వివరించారు. డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేస్తే, జగన్ సీఎం అయిన తర్వాత నాలుగు విడతల్లో మాఫీ చేసి చూపించారని, ఆసరా, చేయూత పథకాలలో కూడా అదే విధంగా చర్యలు తీసుకున్నారని వివరించారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఇచ్చిన మాట ప్రకారం వితంతు, వృద్ధాప్య పెన్షన్లు రూ. 3వేలకు పెంచనున్నారని, ఇప్పటివరకు రెండు వేలు చూపించే టీడీపీ నేతలకు,ఇక వృద్ధులు, వింతంతువులు మూడు వేళ్లూ చూపుతూ, రూ. 3 వేల పెన్షన్ ను గుర్తు చేయాలని కోరారు. నాలుగున్నరేళ్లగా సువర్ణవంతమైన పాలన చూసి మరోసారి జగన్ గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అందుకే సామాజిక సాధికార యాత్రకు ప్రభంజనంలా జనం తరలివస్తున్నారని వెల్లడించారు. రూ. 5 లక్షల పరిమితి కలిగిన ఆరోగ్య శ్రీని సీఎం జగన్ ఏకంగా రూ. 25 లక్షలకు పెంచారని, పేదల ఆరోగ్యం పట్ల ఆయనకున్న ప్రేమ, ఆత్మీయతకు నిదర్శనమని పేర్కొన్నారు. అయ్యనపాత్రుడు ఇంటికి వెళ్లాలంటే మూడు గేట్లు దాటి వెళ్లాలని, స్థానిక ఎమ్మెల్యే ఎక్కడుంటే అక్కడకి నేరుగా ఎవరైనా వెళ్లవచ్చునని వివరించారు. నర్సీపట్నం శాసనసభ్యుడుగా మరోసారి పెట్ల ఉమా శంకర్ గణేశ్ ను గెలిపిస్తే, సీఎం జగన్ ఈసారి ఆయనకు ఎంతటి ఉన్నత స్థానం కల్పిస్తారో అంతా చూడవచ్చునన్నారు.