విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి కదులుతున్న రైలు ఎక్కబోతూ అదుపుతప్పి కిందపడిపోయాడు. ప్లాట్‌ఫామ్, రైలు మధ్య ఉన్న ఖాళీ స్థలంలో పడిపోయాడు. రైలు వెళ్లిపోయిన తర్వాత కొంత మంది పట్టాల మీదకి దిగి, అతడిని పైకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం నుంచి అతడు చిన్న గాయం కూడా కాకుండా బయటపడటంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. బాధిత వ్యక్తిని అనంతపురానికి చెందిన ప్రతాప్ గుర్తించారు. అతడి వయస్సు 55 నుంచి 60 ఏళ్ల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు.
శనివారం (డిసెంబర్ 30) సాయంత్రం 7.45 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ నంబర్ 1పై ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలు అప్పుడే బయల్దేరి, రన్నింగ్‌లో ఉండగా ప్రతాప్ ఎక్కడానికి ప్రయత్నించారు. అదుపుతప్పి కిందపడిపోయారు. అక్కడే ఉన్న ప్రయాణికులు, ఆర్పీఎఫ్ పోలీసులు ఆందోళనకు గురయ్యారు. అయితే, ప్రతాప్ పడిపోయిన చోట గ్యాప్ కాస్త ఎక్కువగా ఉండటం, కిందపడిపోయిన వెంటనే అతడు చాకచక్యంగా పడుకొని ఉండటంతో ప్రమాదం తప్పింది. కదులుతున్న రైలు ఎక్కాల్సిన అవసరం ఏంటని, పైగా ఆ వయసులో అలా చేయడం ఏంటని రైల్వే పోలీసులు అతడిని మందలించారు. తాగునీరు అందించి, అతడికి సాంత్వన కలిగించారు.