న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలకు సీఎం జగన్ గుడ్‌న్యూస్ చెప్పారు. వైఎస్సార్ పెన్షన్ కానుకను రూ.3 వేలకు పెంచుతూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ ప్రకారం ఏటా పింఛన్‌ను రూ. 3 వేల వరకు పెంచుకుంటూ పోతాం అని పేర్కొన్న జగన్ మోహన్ రెడ్డి.. ఈ మేరకు ఎన్నికల హామీని పూర్తి చేశారు. ఈ క్రమంలోనే నేటి నుంచి జనవరి 8 వ తేదీ వరకు 8 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణంలో పెన్షన్ల పెంపు ఉత్సవాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని సూచించారు. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్‌లో ఈనెల 3 వ తేదీన జరగనున్న కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్.. పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు.
ఈ సందర్భంగానే కొత్తగా అర్హులైన వారికి పెన్షన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద కొత్తగా 1,17,161 మంది పెన్షన్లు అందుకోనున్నారు. దేశంలోనే అత్యధికంగా 66.34 లక్షల మందికి నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. 2019 వరకు వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ పెన్షన్ కేవలం రూ.1000 ఉండేది. ఆ తర్వాత ఎన్నికల వేళ రాష్ట్రంలో పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచుతామని వైసీపీ హామీ ఇచ్చింది. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి.. ఒకేసారి పెన్షన్ మొత్తాన్ని రూ.2250 తో ప్రారంభించారు. ఆ తర్వాత ఏటా రూ.250 పెంచుకుంటూ ఇప్పుడు చివరిగా.. రూ.3,000 అందిస్తున్నారు. 66.34 లక్షల పెన్షన్లకు ఏటా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ రూ.23,556 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇక జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లలో పెన్షన్లపై ఖర్చు చేసిన మొత్తం రూ. 83,526 కోట్లకు పైనే అని ప్రభుత్వం తెలిపింది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన జులై 2019 నుంచి పెన్షన్‌ను రూ.2,250 లకు పెంచారు. ఆ తర్వాత జనవరి 2022న రూ.2,500.. జనవరి 2023న రూ. 2,750కు పెంపు.. జనవరి 2024న రూ.3 వేలకు పెంచారు.