రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘జగనన్న ఆరోగ్య సురక్ష ’ (జేఏఎస్) రెండో దశ అమలుకు వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమైంది. నేటి నుంచి గ్రామాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా వారానికి రెండు రోజుల చొప్పున మంగళ, శుక్రవారాల్లో జేఏఎస్‌ను నిర్వహిస్తారు. ఇక పట్టణాలు, నగరాల్లో రెండో దశ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. తొలిదశలో భాగంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లో 50 రోజులపాటు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున వైద్య శిబిరాలను విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. సొంత ఊళ్లలోనే 60 లక్షల మంది ప్రజలకు ప్రభుత్వం ఉచిత వైద్య సేవలందించింది. నిరంతరాయంగా కార్యక్రమాన్ని కొనసాగించడంలో భాగంగా రెండో దశను చేపట్టారు.ఆరు నెలల్లో 13,954 శిబిరాలు జేఏఎస్ రెండో దశలో రాష్ట్రవ్యాప్తంగా ఆరు నెలల్లో 13,954 సురక్ష శిబిరాలు నిర్వహించేలా వైద్య శాఖ ప్రణాళిక రూపొందించింది. గ్రామాల్లో 10,032, పట్టణాలు, నగరాల్లో 3,922 చొప్పున శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ నెలలో 3,583 శిబిరాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి మండలంలో వారానికి ఒక గ్రామం చొప్పున, మునిసిపాలిటీల్లో వారానికి ఒక వార్డు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను ఆర్నెళ్లలో కవర్ చేసేలా శిబిరాలను నిర్వహిస్తారు. శిబిరాల నిర్వహణకు 15 రోజుల ముందు ఒకసారి, మూడు రోజుల ముందు మరోసారి వలంటీర్లు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి జేఏఎస్–2పై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ప్రతి శిబిరంలో స్థానిక మెడికల్ ఆఫీసర్‌తో పాటు ఇద్దరు స్పెషలిస్టు వైద్యులు, పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ ఉంటారు. ప్రజలకు సొంత ఊళ్లలో స్పెషలిస్ట్ వైద్య సేవలందించేందుకు 543 జనరల్ మెడిసిన్, 645 గైనకాలజిస్ట్, 349 జనరల్ సర్జన్, 345 ఆర్థోపెడిక్స్, 378 మంది చొప్పున ఇతర స్పెషలిస్ట్ వైద్యులను, కంటి సమస్యల స్క్రీనింగ్ కోసం 562 మంది పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్లను నియమించారు. వైద్య శిబిరాల్లో అవసరమైన అన్ని రకాల మందులను అత్యవసర ఔషధాలతో సహా అందుబాటులో ఉంచుతున్నారు. వైద్య పరీక్షల నిర్వహణకు ఏడు రకాల కిట్లు శిబిరాల్లో అందుబాటులో ఉంటాయి.