ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ జనసేన కలిస్తే అరాచకం ఎలా ఉంటోందో ఇప్పుడు తెలిసొచ్చిందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంత్రి విడదల రజిని కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించిన అంబటి.. అరాచకవాదులుగా టీడీపీ శ్రేణులు తయారయ్యాయంటూ మండిపడ్డారు. మంత్రి రజినీ ఆఫీస్‌పై పక్కా ప్రణాళికతోనే దాడి చేశారని మంత్రి అంబటి మండిపడ్డారు. రజినినీ ఓడించలేకే దాడులకు పాల్పడుతున్నారన్నారు. దాడులు చేయడమే టీడీపీ లక్ష్యంగా చేసుకుందని.. ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు అరాచకవాదులుగా తయారయ్యారన్నారు. ఎర్ర పుస్తకాల్లో(లోకేష్ రెడ్ బుక్‌ను ప్రస్తావిస్తూ..) పేర్లు రాసుకుని బెదిరిస్తారా? అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒక మహిళా మంత్రిపై.. అందునా బీసీ నేతపై దాడి మంచిది కాదని అంబటి హితవు పలికారు. రాష్ట్రంలో టీడీపీ జనసేన కలిస్తే అరాచకం ఎలా ఉంటోందో ఇప్పుడు తెలిసిందని చెప్పారు. కుప్పంలో చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే ఇలాంటి దాడులకు దిగుతున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేశారని మంత్రి అంబటి రాంబాబు ఉద్ఘాటించారు. గతంలో రుణమాఫీ చేస్తానని చంద్రబాబు రైతులను మోసం చేశాడు. రావణుడికి పది తలలు ఉన్నట్లే.. చంద్రబాబుకి పవన్ ఒక తలగా ఉంటుండని ఎద్దేవా చేశారు. సీఎం అయితేనే అసెంబ్లీకి వస్తాననే మనస్తత్వం చంద్రబాబుదని.. పదవిపై చంద్రబాబుకి ఎందుకంత వ్యామోహమే అర్థం కావట్లేదన్నారు మంత్రి అంబటి. అయితే.. వందమంది కలిసివచ్చినా సీఎం జగన్‌ను ఓడించలేరని.. వచ్చే ఎన్నికల కోసమే 175 మంది సభ్యుల టీమ్‌ను సిద్ధం చేస్తున్నారని అంబటి చెప్పారు.