వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల రెండో జాబితాను విడుదల చేసింది. మొత్తం 27 మంది పేర్లతో కూడిన జాబితాను మంగళవారం పార్టీ సీనియర్ నేత.. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. విస్తృత చర్చల తర్వాత పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ తుది జాబితాను రూపకల్పన చేయించినట్లు తెలుస్తోంది. ‘‘మొత్తం 175కు 175 సీట్లు మనం గెలవాలి. ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తాం’’ అని సీఎం వైయస్ జగన్ పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో సామాజీక సమీకరణాలే లక్ష్యంగా జాబితా రూపకల్పన జరిగినట్లు స్పష్టమవుతోంది. తాజా జాబితాలో పలువురికి స్థానచలనం జరిగింది. అలాగే.. పలువురు ఎమ్మెల్యేల వారసులకు ఇన్‌ఛార్జిల పోస్టులు దక్కాయి. ఎంపీలకూ అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పజెప్పారు.